తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే ఈ కేసులో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయిపోయింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ మాత్రమే మిగిలి ఉంది. రేపు దానం నాగేందర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి ఆయన విచారణకు వస్తారా లేదంటే రాజీనామాకు సిద్ధమవుతారా అనే ప్రశ్నలు ఎక్కువ అయిపోయాయి. దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఆయన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. అటు కడియం శ్రీహరి వ్యవహారం కూడా ఇంతే.
గులాబీ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత తన కూతురును కాంగ్రెస్ టికెట్ పైన గెలిపించుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు కడియం శ్రీహరి. అందుకే ఈ ఇద్దరూ ఇప్పుడు గులాబీ పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. స్పీకర్ ఈ ఇద్దరిపై ఇప్పుడు వేటు వేస్తారా లేదా అనేదే ప్రశ్న. ఒకవేళ వీరిద్దరూ రాజీనామాకు సిద్ధం కాకపోతే స్పీకర్ కచ్చితంగా ఈ ఇద్దరిపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ వీరిద్దరిపై వేటు వేస్తే మిగతా వారిపై కూడా ఆ ఎఫెక్ట్ కచ్చితంగా పడుతుంది. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కూడా వేటు వేసే ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా వీరిద్దరితో రాజీనామాలు చేయించి హస్తం టికెట్ పైనే గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట. అలా చేస్తే మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. పైగా సుప్రీంకోర్టు కీలక ఆదేశం ఉంది కాబట్టి ఎక్కువ సమయం కూడా దీన్ని లాగేందుకు ఛాన్స్ లేదు. మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి.