TERROR ATTACK: సిడ్నీ ఉగ్ర హంతకుడు.. హైదరాబాదీనే..!
కీలక ప్రకటన చేసిన తెలంగాణ డీజీపీ కార్యాలయం
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. అతడు హైదరాబాద్ నుంచి పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ కార్యాలయం దీనిపై ప్రకటన విడుదల చేసింది. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వ్యక్తి అని వెల్లడించింది. ‘‘బీకామ్ చదివిన సాజిద్ 27 ఏళ్ల క్రితం 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు నవీద్ అక్రమ్, కుమార్తె. వీరిద్దరూ ఆస్ట్రేలియా పౌరులే. సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నాడు. అయితే, హైదరాబాద్‌లో అతడికి అతి తక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వలస వెళ్లాక సాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చాడు. కుటుంబ, ఆస్తుల సంబంధించిన వ్యవహారాల కోసమే ఇక్కడకు వచ్చాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఉగ్రవాదులతో సాజిద్‌కు సంబంధాలపై తమకేమీ తెలియదని హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులు తెలిపారు’’ అని తెలంగాణ డీజీపీ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.