TERRORISTS: ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు
చెర నుంచి విడిపించాలంటూ తల్లిదండ్రుల వేడుకోలు
ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ప్రవీణ్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. గత నెల 23న విధులు ముగించుకుని వస్తుండగా JNIM ఉగ్రవాద సంస్థకు చెందిన దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. గత నెల 22న అతడు ఇంటికి చివరి కాల్ చేశాడు. ఆ తర్వాతి రోజు నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 4న బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడు కిడ్నాప్ అయ్యాడని సమాచారం అందజేశారు. కాగా, 23న ప్రవీణ్ విధులు ముగించుకుని తాను ఉంటున్న గది వద్దకు వెళ్తుండగా జేఎన్ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని తెలిపారు. గతంలోనూ ఆ ప్రాంతంలో అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేశారు. బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయం అధికారులతో ప్రవీణ్ ఆచూకీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుటుంబ సభ్యులు తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.