TG: మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు
దరఖాస్తులతో రూ.2,863 కోట్ల ఆదాయం.. ఈనెల 27వ తేదీన మద్యం దుకాణాల డ్రా.. రంగారెడ్డి జిల్లాలో 29,430 దరఖాస్తులు
తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చేసిన తర్వాత ఈ ఆదాయాన్ని ఆర్జించింది. గురువారం గడువు ముగిసే సమయానికి 95 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున, నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో సహా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీసు పరిమితుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపించాయి. చివరి రోజున 4,822 అర్జీలు వచ్చాయి. జిల్లాల వారీగా మద్యం షాపుల దరఖాస్తుదారుల సమక్షంలో ఈ నెల 27న ఉదయం 11 గంటలకు డ్రా తీయనున్నారు. వచ్చిన దరఖాస్తులను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్లో 29,420 రాగా.. ఆదిలాబాద్లో అత్యల్పంగా 4154 వచ్చాయి. శంషాబాద్లో 8536, సరూర్నగర్ 7845, మేడ్చల్ 6063, వ ుల్కాజిగిరి 5168, నల్లగొండ 4906, సంగారెడ్డి 4432, ఖమ్మం 4430, కొత్తగూడెం 3922, హైదరాబాద్ 3201, వరంగల్ అర్బన్ 3175, సికింద్రాబాద్లో 3022, నిజామాబాద్ 2786, సిద్దిపేట 2782, యాదాద్రి భువనగిరి 2776, సూర్యాపేట 2771 దరఖాస్తులు వచ్చాయి.
గతంలో రూ.2లక్షలు ఉన్న దరఖాస్తు రుముము ఈసారి మూడు లక్షలుగా చేశారు. రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చాయి. అదే రోజు బీసీ బంద్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. దీంతో పలువురి అభ్యర్థన మేరకు గడువును 23వ తేదీ వరకు పొడిగించారు. చివరి రోజు వరకు 95,436 దరఖాస్తులు అందాయి.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మద్యం దుకాణాల కేటాయింపు నిబంధనలను రూపొందించి వాటిని ఉల్లంఘించడం ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించడం కుదరదని, నిబంధనల ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించడానికి ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలంది. చట్టబద్ధతలేకుండా గడువు పొడిగింపు జరిగినట్లయితే దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.