తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ విద్యలో పలు మార్పులను ప్రతిపాదించింది. ఆర్ట్స్ గ్రూప్‌లతో పాటు భాషా సబ్జెక్టుల్లో కూడా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోంది. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులను ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్ల రూపంలో ఇంటర్నల్‌గా కేటాయించి, మిగతా 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఆమోదం ఇస్తే, సైన్స్ గ్రూప్‌లతో పాటు ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు కూడా 20 మార్కుల ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరి కానుంది. ఇప్పటికే 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్టులో 20 మార్కుల ప్రాక్టికల్స్ అమల్లో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్‌లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం భవిష్యత్తులో అన్ని భాషా సబ్జెక్టుల్లోనూ ఇంటర్నల్ మార్కులు అమలు చేయనున్నారు. దీంతో హెచ్ఈసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలోని ప్రతి సబ్జెక్టుకు 20 ఇంటర్నల్ మార్కులు కేటాయించబడతాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. పరీక్షల విధానంలోనూ ఈ మార్పులను చేర్చాలని బోర్డు యోచిస్తోంది. పాఠ్య ప్రణాళిక రివిజన్ కమిటీ నిపుణుల సిఫారసుల ఆధారంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు.