TG: 85 చోట్ల కాంగ్రెస్.. 17 స్థానాల్లో బీఆర్ఎస్
105 స్థానాల్లో మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక పూర్తి... మరికొన్నిచోట్ల నేటికి వాయిదా పడిన ఎన్నిక
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రధానంగా ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించగా, వాటిలో 105 మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక విజయవంతంగా పూర్తయ్యాయి. మరో 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 105 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం చాటుకుంది. మొత్తం 84 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీఆర్ఎస్ 17 స్థానాలు దక్కించుకుంది. ఒక మున్సిపాలిటీలో బీజేపీ విజయం సాధించగా, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయానికి 90 మున్సిపాలిటీల్లో వివిధ రాజకీయ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ లభించింది. అయితే 36 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదిరి, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఛైర్పర్సన్లను ఎన్నుకున్నారు. దీంతో కొన్ని మున్సిపాలిటీల్లో అధికార పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆధిక్యాన్ని సాధించాయి. మరోవైపు రాష్ట్రంలోని మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఏడు కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. ఒక కార్పొరేషన్‌ను సీపీఐ-కాంగ్రెస్ మిత్రపక్షం గెలుచుకోగా, మరొకదాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.
వాయిదా పడిన 11 మున్సిపాలిటీలలో ఎనిమిది చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పరిశీలకులను నియమించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు పార్టీ తరఫున ప్రత్యేక అబ్జర్వర్లను నియమించామని తెలిపారు. ఈ అబ్జర్వర్లు స్థానికంగా పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుని ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజులను నియమించారు. జనగాం మున్సిపాలిటీకి బీర్ల ఐలయ్య, గండ్ర సత్యనారాయణలను బాధ్యతలు అప్పగించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ఎమ్మెల్యేలు బాలు నాయక్, వీర్లపల్లి శంకర్‌ను అబ్జర్వర్లుగా నియమించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను ఎంపిక చేశారు. ఖానాపూర్ మున్సిపాలిటీకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతిరెడ్డిలను బాధ్యతలు అప్పగించారు. ఇంద్రేశం మున్సిపాలిటీకి ఎమ్మెల్యేలు పి. రామ్మోహన్ రెడ్డి, శ్రీ గణేష్‌లను నియమించారు.