TG: యమపాశాలుగా విద్యుత్ తీగలు
10 ప్రాణాలు బలిగొన్న విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం... రామాంతపూర్‌లో శోభాయాత్రలో ఆరుగురు దుర్మరణం;
మూడు రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో జరిగిన మూడు విషాద ఘటనల్లో 10 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. యువకులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. రామంతాపూర్ గోఖలే నగర్ లో ఆదివారం కృష్ణాష్టమి సందర్భంగా రోజంతా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు...రాత్రి రథంపై ఊరేగింపు నిర్వహించారు.. సందడిగా కొనసాగిన శోభాయాత్రలో పెద్దసంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. అయితే యాత్ర చివరిలో విద్యుత్ తీగలకు నిర్లక్ష్యంగా తగిలించి ఉన్న కొక్కెం లాంటి మరో తీగ రథానికి తగలడంతో రథమంతా విద్యుత్ ప్రకంపనలు వ్యాపించాయి.. రథాన్ని నడిపిస్తున్న వారిలో ఐదుగురు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా ఒక యువకుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. మొత్తంగా ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు. బండ్లగూడలో వినాయక విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్ వరకు గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్ పై తరలిస్తుండగా బండ్లగూడ వద్ద ట్రాక్టర్‌కు వేలాడుతున్నట్లుగా ఉన్న కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పైన కూర్చున్న ముగ్గురు యువకులు మరణించారు. మరో దుర్ఘటన అంబర్‌పేటలో జరిగింది. గణేష్ మండపం ఏర్పాటు లో భాగంగా కాస్త అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లను కర్రతో పైకి లేపడానికి రామ్ చరణ్ అనే యువకుడు ప్రయత్నించాడు. కర్ర నుండి పట్టుతప్పి యువకుడి చేతికి తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయిన రామ్ చరణ్ తీవ్రగాయాలతో హాస్పిటల్ లో మృతి చెందాడు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేనా..?
నిత్యం కురుస్తున్న వర్షాలతో నేల తడిగా ఉంటోంది. విద్యుత్ తీగలు ఎలాంటి రక్షణ లేకుండా ఉంటున్నాయి. ఆ తీగలకు ఏదైనా తగిలిన వెంటనే తడి వల్ల మొత్తం వాహనానికి కూడా విద్యుత్ సరఫరా జరిగి ఘోరం జరుగుతోంది. తీగలు ప్రమాదకరంగా ఉన్నచోట చర్యలు చేపట్టడం.. వర్షాల వేళ.. ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించడం.. ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యతను అధికారులు విస్మరించడం వల్లే...ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
మా నిర్లక్ష్యం లేదు: ఎస్ఈ
విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో చనిపోయినట్లు ఆనవాళ్లు లేవని ఎస్ఈ శ్రీరామ్మోహన్ తెలిపారు. బండ్లగూడలోని సంఘటన స్థలిని ఆయన పరిశీలించారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో ఇద్దరు చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ట్రాలీపై ఉన్న వ్యక్తులు కిందపడి తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.