TG: 'అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయి'

కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అన్న కాళేశ్వరం కమిషన్ నివేదిక;

Update: 2025-08-04 07:00 GMT

 కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్​ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్​లో చర్చించకుండానే సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్​ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చు అంచనాలను పెంచేశారని పేర్కొంది.

అవినీతికి అడ్డాగా..

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తామని చెప్పి ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇప్పుడు అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ద్వారా బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అనేక అక్రమాలు, కాంట్రాక్టుల అవకతవకలు, రెడిజైనింగ్‌లో జరగిన రూల్ బ్రేకింగ్‌పై కమిషన్ స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యల కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను ఈ సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా సమర్పించనుంది. కమిషన్ నివేదికలో ప్రధానంగా ప్రాజెక్టు రూపకల్పన, అనుమతులు లేకుండానే పనులు చేపట్టడం, నీటి లభ్యత లేని చోట బ్యారేజీలు నిర్మించడం, భారీ మొత్తంలో వ్యయ భారం మోపటం వంటి అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకుగల పూర్తి బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అసెంబ్లీలో తానే ప్రాజెక్టును రీడిజైన్ చేశానని కేసీఆర్ చెప్పిన విషయం ఇప్పుడు కీలక ఆధారంగా మారే అవకాశముంది. టెండర్లు, కాంట్రాక్టుల ఎంపికపై కూడా ఆయన నేరుగా ప్రమేయం చూపినట్టు పలు ఆధారాలు ఉన్నట్లు తెలిసింది.

మంత్రివర్గ ఆమోదం లేకుండానే...

ఇదిలా ఉండగా, ప్రాజెక్టు ప్రారంభంలోనే మంత్రివర్గ ఆమోదం లేకుండానే పనులు ప్రారంభించారని, తర్వాత కేబినెట్‌ను ‘ఫార్మాలిటీ’గా పరిగణించి ఉత్తర్వులు తెప్పించారని ప్రభుత్వ వర్గాలు అప్రత्यक्षంగా స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కమిషన్‌కి సమర్పించిన సమాచారంలో బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న అన్ని ముఖ్య నిర్ణయాలూ – ప్రాజెక్టు ఆలోచన, రూపకల్పన, బ్యారేజీల ఎంపిక, టెండర్ల ప్రక్రియ మొదలైన అంశాలు చొప్పున వివరించినట్టు తెలిసింది. ఇప్పటికే చత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందాలపై వచ్చిన మరో కమిటీ నివేదికను ప్రభుత్వం ఇంతవరకు తీసుకోకపోవడం, కానీ కాళేశ్వరం అంశంలో మాత్రం కేబినెట్ చురుకుగా వ్యవహరించడం చూస్తే, ఈసారి ఏదో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో జరిగిన అవకతవకలపై న్యాయప్రకారం విచారణ జరిపిస్తామన్న వాగ్దానానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపధ్యంలో సోమవారం కేబినెట్ సమావేశం రాజకీయంగా కీలక మలుపు తిరిగే రోజుగా మారనుంది. ఈ సమావేశంలో కమిషన్ నివేదికను పరిశీలించి, కేసీఆర్‌పై నేరపూరిత నిర్ధారణ ఉంటే తదుపరి చర్యలకు రూపురేఖలు వేయనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో రాజకీయంగా మారే పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.

Tags:    

Similar News