TG: తెలంగాణలో "మహాలక్ష్మి"కి స్మార్ట్ కార్డులు
తెలంగాణ మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు... మహాలక్ష్మి పథకానికి సంబంధించిన కార్డులు... కార్డులు త్వరగా సిద్ధం చేయాలని ఆదేశాలు
తెలంగాణలో మహిళలకు అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత వ్యవస్థీకృతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించిన స్మార్ట్‌కార్డులను త్వరగా సిద్ధం చేసి మహిళలకు అందించాలని ఆర్టీసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు స్మార్ట్‌కార్డులు జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాల భాగంగా ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్టీసీకి అవసరమైన నిధుల కేటాయింపుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే స్మార్ట్‌కార్డుల జారీ అత్యవసరమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో లెక్కలు సరిగ్గా నిర్వహించేందుకు, ప్రయాణాల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేయడానికి, పారదర్శకతను పెంచడానికి స్మార్ట్‌కార్డుల వినియోగం కీలకమని అధికారులు వివరించారు. మహిళలకు వీలైనంత త్వరగా స్మార్ట్‌కార్డులు అందించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మూడు రకాల స్మార్ట్‌కార్డుల నమూనాలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు చూపించారు. కార్డుల రూపకల్పన, సాంకేతిక లక్షణాలు, చిప్ ఆధారిత సౌకర్యాలు వంటి అంశాలపై వివరాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్డులు చిప్‌తో కూడి ఉండటంతో ప్రయాణ వివరాలు డిజిటల్‌గా నమోదు కావడం, దుర్వినియోగం తగ్గడం, ప్రభుత్వానికి ఖర్చులపై స్పష్టమైన డేటా లభించడం వంటి ప్రయోజనాలు ఉంటాయని అధికారులు వివరించారు. స్మార్ట్‌కార్డుల అమలును ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించకుండా ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ ప్రయోగాత్మకంగా కార్డులు జారీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌లో సుమారు 5 లక్షల మంది మహిళలకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వాటిని గుర్తించి పరిష్కరించి, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కార్డులు జారీ చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. స్మార్ట్‌కార్డుల తయారీకి సంబంధించిన అంచనాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి.