TG: రవాణాశాఖ చెక్ పోస్టులు మూసివేత
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అవినీతికి చెక్ పెట్టేందుకు నిర్ణయం.. తక్షణమే మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు.. ఆన్ లైన్లో తాత్కాలిక పర్మిట్ల జారీ
రాష్ట్రంలోని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని స్పష్టం చేశారు. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలని, ఆర్థిక మరియు పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వడంతో పాటు చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదికను ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమలో తాజాగా ఈ ఉత్తర్వులు వెలువడటం ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు మొత్తం 15 ఉన్నాయి. వీటిలో 14 రాష్ట్ర సరిహద్దుల్లో ఉండగా, ఒకటి ఇంటర్నల్ చెక్‌పోస్టు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీతో పాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనల్ని అరికట్టేందుకు వాటిని ఏర్పాటు చేశారు. పర్మిట్ల జారీ పేరుతో కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు చాన్నాళ్లుగా ఉన్నాయి. అక్కడ పోస్టింగ్ కోసం, అలాగే ఆ స్థానం నుంచి బదిలీ కాకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఒత్తిళ్లు చేస్తుంటారు. దీంతో చెక్‌పోస్టులను తొలగిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెక్‌పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను తొలుత ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చెక్‌పోస్టుల ద్వారా రవాణాశాఖకు వస్తున్న ఆదాయం ఏడాదికి 50-60 కోట్ల రూపాయలు ఉంటోంది. రవాణాశాఖ మొత్తం ఆదాయంలో ఇది 0.82 శాతం మాత్రమే. రవాణాశాఖ ఉద్యోగుల్లో ఏకంగా 17 శాతం మంది చెక్‌పోస్టుల్లోనే పనిచేస్తున్నారు.