TG: పీఠం దక్కేదెవరికో..? ఖేదం మిగిలేదెవరికో..?
నేడే మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక... ఇప్పటికే క్యాంపులలో ఉన్న కార్పొరేటర్లు... నేరుగా ఎన్నిక జరిగే ప్రాంతానికే తరలింపు.. హంగ్ ఉన్న చోట ఉత్కంఠ రేపుతున్న వ్యూహాలు...
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ముందు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంప్ రాజకీయాలకు తరలించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండిపెండెంట్లు కింగ్మేకర్లుగా మారడంతో బేరసారాలు ఊపందుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తికాగా, ఏడు నగరపాలక సంస్థలు మరియు 116 మున్సిపాలిటీల్లో పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అయితే 24 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితి నెలకొనడం రాజకీయ సమీకరణాలను సంక్లిష్టం చేసింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్త గూడెం, నిజామాబాద్, కరీంనగర్, కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో పరకాల, అలంపూర్, నర్సాపూర్, జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత, కోహీర్, దేవరకద్ర, వేములవాడ, రాయికల్, జహీరాబాద్, మహబూబాబాద్, బోధన్, గద్వాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇండిపెండెంట్లే ఫలితాన్ని నిర్ణయించే స్థితిలో ఉండటంతో అన్ని పార్టీలూ వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.
హంగ్ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ తమ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మహారాష్ట్రకు తరలించగా, కాంగ్రెస్ తమవారిని హైదరాబాద్‌లో క్యాంప్‌లో ఉంచింది. కమ్యూనిస్టు పార్టీలు తమ కార్పొరేటర్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలించాయి. క్యాంప్‌ల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా సిద్ధంగా ఉంచారు. ఈ చర్యలన్నీ సభ్యుల రక్షణ పేరుతో చేపట్టినప్పటికీ, రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి. కొన్ని ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లను తనవైపు తిప్పుకోవడంతో ఛైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం. అయితే మిగతా హంగ్ మున్సిపాలిటీల్లో సమీకరణాలు చివరి నిమిషం వరకు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మేయర్, ఛైర్పర్సన్ ఎన్నికలు ‘చేతులెత్తే పద్ధతి’లో నిర్వహించనున్నారు. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులు సమావేశంలో పాల్గొని ఓటు వేయనున్నారు. మొత్తం సభ్యుల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి విజేతగా ప్రకటించబడతారు. ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చినట్లయితే లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికలు కూడా ఇదే విధంగా జరుగుతాయి. దీంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. మొత్తానికి హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇండిపెండెంట్ల వైఖరి కీలకంగా మారడంతో బేరసారాలు జోరందుకున్నాయి.