TGPSC: నేడే గ్రూప్-1 ఫలితాలు
మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో ధ్రువపత్రాల పరిశీలన;
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ముందుగా మార్కులను ప్రకటించనుండగా.. తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు. మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్ తుది పరిశీలన నిర్వహిస్తోంది. తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తరువాత అభ్యంతరాలున్న వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తుంది. ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనున్నట్లు సమాచారం. తొలుత గ్రూప్-1 ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరచనుంది. అభ్యర్థులు మార్కుల వివరాలు తెలుసుకోవడానికి https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
అభ్యంతరాలు ఉంటే..
ఫైనల్ మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కోపేపర్‌కు రూ.1000 చెల్లించి రీకౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆయా పేపర్లలో మార్కులను మరోసారి లెక్కిస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత TGPSC Group 1 Mains మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.