Musi River: మూసీ ఒడ్డున కూల్చివేతలకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం

మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తింపు...మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం;

Update: 2024-09-25 05:15 GMT

తెలంగాణ ప్రభుత్వం మూసీ ఒడ్డున కూల్చివేతలకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. యాక్షన్ ప్లాన్ పై సెక్రటేరియట్‌లో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. ఈ క్రమంలో.. కూల్చివేతల సందర్భంగా నివాసితులు నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టింది అధికార యంత్రాంగం. ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా కల్పించిన తర్వాత.. హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగనున్నాయి. కాగా.. నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.

చెరువుల వద్ద సీసీ కెమెరాలు: రేవంత్‌

చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, మెట్రో రైలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలు సేకరించాలని, వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సంబంధిత అధికారులతోపాటు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కూడా పాల్గొన్నారు.

2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

2008 డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అప్పట్లో ఉద్యోగం రాని 2,300 మంది అభ్యర్థులను కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరగనుంది. మినిమం టైం స్కేల్ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాలపై కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News