TG: తెలంగాణలో ముగిసిన బీఆర్ఎస్ శకం
గులాబీ పార్టీ నేతలవి పగటి కలలన్న టీపీసీసీ అధ్యక్షుడు;
తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల నాటికి గులాబీ పార్టీనే ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గులాబీ పార్టీలో తండ్రీకొడుకులు తప్ప ఇంక ఎవ్వరూ ఉండరని పేర్కొన్నారు. దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని.. ఆయన జైలుకు పోక తప్పదని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీకి అసలు అడ్డులేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ము తిన్న వారికి శిక్ష తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో పెద్ద క్రైమ్ చేశారని.. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని పూడ్చేపనిలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అధికారం కోల్పోయిన అక్కసుతో దారుణంగా మాట్లాడుతున్నారని... ఒక్క కుర్చీ కోసం ముగ్గురు కొట్లాడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. హరీశ్ రావు వేరే పార్టీ చూసుకోవాల్సిందేనని... ఈ-కారు రేస్‌లో కేటీఆర్ అడ్డంగా దొరికారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజా ధనం దుర్వినియోగం, దోపిడీ చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. బీజేపీ మతం పేరిట ఓట్లు అడుగుతోందని.. కులం, మతం పేరిట ఓట్లు అడగడం వల్ల రాబోయే తరాలు ఇబ్బంది పడతారని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎనుముల తిరుపతి రెడ్డి పాల్గొని తన చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కులు అందజేస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఎమ్మెల్యే బదులు అధికార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఎవరు అంటూ కేటీఆర్ విమర్శించగా.. దానిపై స్పందించిన సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ట్విట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. "సిగ్గుందా సైకో రామ్?? నువ్వు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నావా ??? ఇవే వ్యాఖ్యలకి నువ్వు అద్దం ముందు చేస్తే.. నీ నీడ కూడా నీ మీద ఉమ్మేస్తది.. ఏ పదవీ లేనప్పుడు మీ అయ్యకి టాబ్లెట్లు, టాయిలెట్ పేపర్లు అందించే సంతుకి 1+1 సెక్యూరిటీ ఎవడు ఇచ్చిండు??" మీ కుటుంబంలాగ అయ్య కాళేశ్వరం, బావ కాకతీయ, చెల్లె లిక్కర్, తమ్ముడు మొక్కల్, నువ్వు A - Z చేసిన కుంభకోణాల మాదిరి కాదు." అంటూ ఘాటైన వ్యాఖ్యలతో సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కేటీఆర్ మాటల్లో బేలతనం
కేటీఆర్ మాటల్లో బేలతనం కనిపిస్తుందని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు. జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లాలో పది ఎకరాల భూములు కబ్జా కాలేదని గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఆక్రమించిన స్థలంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కట్టారని ఆది శ్రీనివాస్ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆక్రమించి కట్టిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని, అర్హులకు చెందాల్సిన భూములు అక్రమంగా కబ్జా చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.