పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్ని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. ఈ మేరకు కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నేడు ఆరు జిల్లాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు, గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా సూచనలు అందించనున్నారు. చాలా మంది పట్టభద్రులు అవగాహన లేక ఓటర్లుగా నమోదు కావడం లేదు.
ఓటర్లుగా నమోదయ్యేలా చైతన్యం కలిగించేలా తీసుకోవాల్సిన చర్యల్ని సూచించనున్నారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ... నవంబర్ 6 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీ కాలం ముగిసినందున రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.