Viral : ఒకే వీధికి ఆరు పేర్లు.. గజ్వేల్ లో హాట్ టాపిక్ గా మారిన కాలనీ పేరు వివాదం..
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఒక కాలనీ పేరు వివాదం వార్తల్లోకి ఎక్కింది. పేరు వార్తల్లోకి ఎక్కడం ఏంటి అనుకుంటన్నరా... ఏ కాలనీకి అయినా ఒక్క పేరు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే కాలనీకి ఏకంగా ఆరు పేర్లు పెట్టారు. ఉన్నది 25 ఇండ్లే అయినా రాత్రికి రాత్రే 6 కొత్త బోర్డులు ప్రత్యక్షమవడంతో ఈ నేమ్‌బోర్డుల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఓ కాలనీలో మొత్తం 25 ఇండ్లు ఉన్నాయి. దీనిని వినాయక నగర్ కాలనీ గా పిలిచే వారు. ఈ కాలనీలో 70 శాతం మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాగా..మిగిలిన 30 శాతం వివిధ సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఇటీవల జరిగిన ఒక వివాదం తర్వాత కాలనీ లో కుల విభేదాలు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో, మెజారిటీ సామాజిక వర్గం తమ కులం పేరుతో ఒక నేమ్‌బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మిగతా కులాలవారు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మిగిలిన కులాలవారు కూడా తమ తమ కులాల పేర్లతో నేమ్‌బోర్డులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెడ్డి ఎన్‌క్లేవ్, ఆర్యవైశ్య ఎన్‌క్లేవ్, ముదిరాజ్ ఎన్‌క్లేవ్, విశ్వకర్మ ఎన్‌క్లేవ్, యాదవ్‌స్ ఎన్‌క్లేవ్ వంటి పేర్లతో కొత్త బోర్డులు వెలిశాయి. ఒకే వీధికి ఆరు వేర్వేరు కులాల పేర్లతో నేమ్‌బోర్డులు ఉండటం స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది గజ్వేల్ పట్టణంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.