త్వరలోనే వార్డు ఆఫీసర్‌ల నియామకాలు: కేటీఆర్
మున్సిపాలిటీల్లో త్వరలోనే వార్డు ఆఫీసర్‌ల నియామకాలు చేపడతామని కేటీఆర్ ప్రకటించారు.;
హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు 67వేల 35 కోట్లు కేటాయించామని అసెంబ్లీలో చెప్పారు. జీహెచ్‌ఎంసీకి ప్రతి నెలా 78 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కై వే నిర్మాణం జరుగుతోందని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 198 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని వివరించారు. హైదరాబాద్‌లో 109 చోట్ల లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి 70 కోట్లు ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. మున్సిపాలిటీల్లో త్వరలోనే వార్డు ఆఫీసర్‌ల నియామకాలు చేపడతామని కేటీఆర్ ప్రకటించారు. మొదటి మూడేళ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పని చేస్తారని వెల్లడించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్‌కు క్రమం తప్పకుండా నిధులు ఇస్తోందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు ఆస్తిపన్ను, నీటి పన్ను పెంచలేదని, పైగా పన్నులు తగ్గించామని చెప్పారు.
జీహెచ్ఎంసీలో ఎస్ఆర్‌డీపీ ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టమని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని వెల్లడించారు. అక్టోబర్ 2 వరకు 11 వేల పబ్లిక్ టాయిలెల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు.