National Turmeric Board: పండుగ రోజే పసుపు బోర్డు

ఇందూరులోనే పసుపు బోర్డు... నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్;

Update: 2025-01-14 01:30 GMT

సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం... తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్ల పసుపు రైతుల కలను సాకారం చేస్తూ.. కీలక ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . బోర్డును ఏర్పాటు చేయడంతోపాటు.. దానికి చైర్మన్‌ను సైతం ప్రకటించింది. జాతీయ పసుపు బోర్డు చైర్ పర్సన్‎గా నిజామాబాద్‎కు చెందిన పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. పల్లె గంగా రెడ్డి మూడేళ్ల పాటు టర్మరిక్ బోర్డు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో పసుపు రైతుల క్రయ, విక్రయాలు, ప్రాసెసింగ్‌కు మరింత ప్రోత్సాహం లభించనుంది. మూడేళ్లపాటు గంగారెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు.

నేడే ప్రారంభం

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. జనవరి 14న ఉదయం 10 గంటలకు నిజామబాద్‎లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్స కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. . ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వ్యవసాయ శాఖల అధికారులు, పశ్చిమ రాష్ట్రాల ఇతర వ్యవసాయ సంబంధిత నాయకులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిసింది. ప్రారంభోత్సవం సందర్భంగా పసుపు రైతులకు సంబంధించి వ్యూహాలు, నూతన ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, సహాయ కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉంది. రైతులకు పసుపు విక్రయాలు, మార్కెట్‌కు ఉన్న అవరోధాలు, రుణాల వంటి అంశాలపై పలు ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి.

ప్రధాని మోదీ హామీ మేరకు...

నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు పసుపు బోర్డు కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాదులోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.

Tags:    

Similar News