ఒక్కొక్కటిగా బయటికొస్తున్న వనమా రాఘవ అరాచకాలు
TRS ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.;
TRS ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సెటిల్మెంట్లు, పంచాయితీలతో పాటు ఎకరాల కొద్దీ అటవీ భూములను కొల్లగొట్టిన వైనం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. స్థానిక ప్రజలతో పాటు ప్రభుత్వ భూములను తన అధీనంలోకి తెచ్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాల్వంచ పట్టణంలో ఈనెల 3న రామకృష్ణ కుటుంబం బలవన్మరణం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న రాఘవేంద్రరావు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు తమకు జరిగిన అన్యాయాలను వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే పోలీసులు వీటిపై దృష్టి సారించగా బయటికిరానివి మరెన్నో ఉన్నాయన్న చర్చ సాగుతోంది.
పాల్వంచ టెరిటోరియల్ పరిధిలో సుమారు 50 ఎకరాల అటవీ భూమిని వనమా రాఘవేంద్రరావు ఆక్రమించాడని స్థానికులు చెబుతున్నారు. ఆక్రమించిన భూమిలో ఆయిల్ పామ్ సాగు చేశాడు. భూమిని ధరణిలో ఎక్కించడానికి సైతం సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఈ తరుణంలో విషయం మీడియాకు లీకవడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆన్లైన్ ప్రయత్నాలను విరమించుకున్నారు. ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా.... ప్రైవేటు భూములను తులమో ఫలమో ముట్టచెప్పి బలవంతంగా లాక్కున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
నిరుపేద గిరిజనులు సాగు చేసుకునే భూములను స్వాధీనం చేసుకోవడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తున్న అటవీశాఖ అధికారులు........ రాఘవేంద్రరావు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవడానికి కనీస ప్రయత్నాలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు పురపాలక పరిధిలోని పలుచోట్ల పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములనూ రాఘవతో పాటు ఆయన అనుచరవర్గం ఆక్రమించింది.
రాఘవ నివాసం ఎదురుగా ఉన్న చింతల చెరువులోనూ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పలు నిర్మాణాలు చేపట్టాడు. నియోజకవర్గ పరిధిలో ఎవరైనా నూతన నిర్మాణాలు, వెంచర్లు చేపట్టాలన్నా రాఘవకు మామూళ్లు ముట్టచెప్పాకే పనులు ప్రారంభించేవారని బాధితులు చెబుతున్నారు. గతంలో వనమా రాఘవపై పలువురు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయకపోగా బాధితులపైనే కేసులు పెట్టి స్వామి భక్తిని చాటుకున్నారని మండిపడుతున్నారు.
వనమా రాఘవ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో అతనికి సహకరించిన అధికారుల్లో గుబులు మొదలైంది. రాఘవ పరారీలో ఉన్న సమయంలో ఆయనకు అనుకూలంగా ఉండి డిపార్ట్మెంటులోని సమాచారాన్ని అందించిన వారిపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వారి వివరాలను సేకరిస్తున్నారు.