సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. శుక్రవారం కాంగ్రెస్ సభలో మాట్లాడిన సీఎం రైతు సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు 9 రోజుల్లో రూ.9వేల కోట్లు అందజేశామన్నారు. రైతుల సంక్షేమంపై ఎవరు కృషి చేశారో దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ లకు సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరిస్తున్నామని.. 8వ తేదీన ఉదయం 11గంలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్దమని కేటీఆర్ ప్రతిసవాల్ విసిరారు. 72గంటల సమయమిస్తున్నాం.. రేవంత్ ప్రిపేర్ అయ్యి రావాలని సెటైర్ వేశారు. చర్చకు భయపడి రేవంత్ పారిపోవద్దని ఎద్దేవా చేశారు.
పేటీఎం మాదిరి.. పే సీఎంగా రేవంత్ రెడ్డి పేరు సంపాదించారని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు జలదోపిడికి వంత పాడుతోంది ఎవరో తెలియదా? అని అన్నారు. చంద్రబాబు అస్సలు కోవర్టు రేవంత్ రెడ్డే అని అన్నారు. ప్రజాపాలన కాదు.. తెలంగాణలో చంద్రబాబు కోవర్టు పాలన సాగుతుందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాల గురించి రేవంత్ మాట్లాడితే నవ్వొస్తుందన్నారు.
రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుందని కేటీఆర్ అన్నారు. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని రేవంత్ చెప్పటం సిగ్గుచేటన్నారు. రేవంత్‌కు బేసిన్ తెలియదు.. బెండకాయ తెలియదని విమర్శించారు. ఎరువులు ఇవ్వటం చేతకాని వాడికి కేసీఆర్ తో చర్చ ఎందుకు?అని ప్రశ్నించారు. ఏ రైతు, ఏ ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ అని చెప్తారన్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మత్స్య సంపదను సృష్టించిందే కేసీఆర్ అని అన్నారు.