Weather Report: ఇకపై భగ భగలే..
ఎన్నడూ లేనంతగా వణికించిన చలికాలం; వేసవి అంతకు మించి ఉండబోతోందంటోన్న వాతావరణ శాఖ...;
చలికాలంలో హైదరాబాద్ కు హిల్ స్టేషన్ వచ్చిందా అన్నట్లు వణికిపోయిన నగరవాసులకు వేసవిలో ఎడారి సెగలు తప్పవని తెలుస్తోంది. శివరాత్రి అన్నా రాకముందే ఉక్కపోత పెరగడమే ఇందుకు సంకేతమని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే పర్యావరణ అసమతుల్యత, పెరిగిపోతున్న కార్బన ఫుట్ ప్రింట్ల వల్లే వాతావరణంలో ఈ అసాాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పర్యావణవేత్తలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఈసారి వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎస్బీకి చెందిన భారతీ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ అంజల్ ప్రకాశ్ వెల్లడించారు. ఫిబ్రవరిలోనే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. కాబట్టి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత తారాస్థాయిలో ఉంటుందని ప్రకాశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరంలో "అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్" నెలకొని ఉందని తెలిపారు. అత్యధిక జనాభా, అత్యధిక ఆర్ధికాభివృద్ధి, మితిమీరిన జన సందోహం వంటి అంశాల వల్ల నగరంలో ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిపారు. అర్బన్ ఫారెస్ట్రీ, భూగర్భ జలాలను పెంపొందించుకోవడం, బ్లూ-గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంపొందించుకోవడం ద్వారా మైక్రో క్లైమేట్ అభివృద్ధి చెంది నగరం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని సూచించారు.