Hanmakonda Crime: మిస్టరీ వీడిన సుపారీ హత్య.. భార్యే హంతకురాలు
Hanmakonda Crime: హన్మకొండలో జరిగిన ఓ సుఫారి హత్య కేసును పోలీసులు చేధించారు. వేధింపులు భరించలేక వేణు కుమార్ అనే వ్యక్తిని అతడి భార్య సుస్మితనే హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు.;
Hanmakonda: హన్మకొండలో జరిగిన ఓ సుఫారి హత్య కేసును పోలీసులు చేధించారు. వేధింపులు భరించలేక వేణు కుమార్ అనే వ్యక్తిని అతడి భార్య సుస్మితనే హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. సెప్టెంబర్ 30న వేణును సుష్మిత సుఫారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు.
అనంతరం పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో మృతదేహాన్ని పడేశారని వెల్లడించారు. ఎవరికీ అనుమానం రాకుండా తన భర్త కనిపించడం లేదంటూ సుష్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 71 రోజుల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు.
అదృశ్యం కేసుతో మొదలైన ఈ ఘటన, దాదాపు రెండున్నర నెలల తర్వాత హత్య కేసుగా మార్చారు. తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తుండటంతో ముగ్గురు వ్యక్తులకు 4లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో సుస్మితతో సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
వేణుకుమార్ స్వస్థలం మహబూబాబాద్. ఇతని ఇద్దరు భార్యలు. కుటుంబంతో కలిసి కాజీపేట డీజిల్ కాలనీకి వచ్చి జీవిస్తున్నాడు. మొదటి భార్య సుస్మిత ప్రభుత్వ ఉద్యోగి. కాజీపేట రైల్వే లోకో షెడ్‌లో టెక్నీషియన్‌గా చేస్తోంది. రెండో భార్య సంతోష ఇంటి వద్దనే ఉంటోంది.
అయితే కొన్నాళ్లుగా వేణు కుమార్ మహబూబాబాద్‌లో మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.ఈ విషయమై వేణు కుమార్‌కు, సుస్మితకు మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. వివాహేత సంబంధం మోజులో పడి ఇద్దరు భార్యలను అతడు శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేసేవాడు.
ఈ బాధలు పడలేక భర్తను ఎలాగైనా చంపాలని సుస్మిత నిర్ణయించుకుని అందుకు పథకం వేసింది. దగ్గరి బంధువు అనిల్ సాయం కోరింది. తన భర్తను హత్య చేస్తే 4 లక్షలు ఇస్తానని మాటిచ్చింది. ఇంకేముంది అనిల్ తన యాక్షన్ ప్లాన్ రెడీ చేశాడు.
వేణును హతమార్చేందుకు తనకు పరిచయం ఉన్న మరో ఇద్దరు సాయం తీసుకున్నాడు. హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన గడ్డం రత్నాకర్, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపెల్లి మండలం ఇస్సిపేటకు చెందిన నవీన్ ను ఆశ్రయించాడు. వీరు ముగ్గురు సుస్మిత నుంచి 2లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు.
గత అక్టోబరు 30న రాత్రి సుస్మిత భర్త వేణుకుమార్‌కు సేమియాలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. వేణు నిద్రలోకి జారుకోగానే అనిల్.. వేణును కారులో కూర్చోబెట్టి, మార్గమధ్యలో పరకాల వద్ద రత్నాకర్, నవీన్‌ను ఎక్కించుకున్నాడు. నడుస్తున్న కారులోనే నిద్రలో ఉన్న వేణుకుమార్‌ను గొంతు పిసికి చంపేశారు. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో మృతదేహాన్ని మానేరువాగులో పడేసి వెళ్లిపోయారు.
అయితే కేసులో సుస్మిత చెప్పే విషయాలపై పోలీసులకు అనుమానం వచ్చింది. పొంతన లేని సమాదానాలు చెబుతుండటంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు... సుస్మిత నుంచి అసలు వివరాలను రాబట్టారు. సుస్మితతో పాటు అనిల్, రత్నాకర్, నవీన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మానేరు వాగు ఇసుకలో కూరుకుపోయిన వేణు కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు.