వర్క్ ఫ్రమ్ హోమ్.. జూమ్‌కాల్స్‌లో సరదా ఘటనలు..
ఇంట్లోనే ఉండి జూమ్‌కాల్స్‌లో పాల్గొంటున్న వారి వల్ల కొన్ని సరదా ఘటనలు జరుగుతున్నాయి.;
కరోనా లాక్‌డౌన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. అన్ని కార్యాలయాలు జూమ్ కాల్స్ మీటింగ్స్ చేస్తున్నాయి. అయితే, ఇంట్లోనే ఉండి జూమ్‌కాల్స్‌లో పాల్గొంటున్న వారి వల్ల కొన్ని సరదా ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఫ్రొఫెసర్ వీడియోకాల్‌లో జీఎస్టీపై ఎంతో సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన సతీమణి వచ్చి ముద్దు పెట్టబోయిన ఘటన వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఓ న్యాయవాది జూమ్‌కాల్ కొనసాగుతుండగానే భోజనం చేస్తూ ఏకంగా సొలిసేటర్ జనరల్ ఆఫ్ ఇండియా కంటపడ్డాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
గతకొంత కాలంగా కోర్టు విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బిహార్‌లోని పట్నాకు చెందిన లాయర్ కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ కాన్ఫరెన్స్‌లో సొలిసేటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా కూడా ఉన్నారు. అయితే, తన వాదనలు పూర్తయిన తర్వాత ఆ లాయర్... జూమ్‌కాల్ వీడియో ఆఫ్ చేయకుండా కెమెరా ముందే ప్లేట్ పట్టుకొని భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసిన తుషార్ మెహతా విస్తుపోయారు. కెమెరా ఆన్‌లోనే ఉందని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, అది న్యాయవాదికి వినపడలేదు. చివరికి తుషార్ మెహతా అతడి పర్సనల్ ఫోన్‌కి కాల్ చేసి పరిస్థితి వివరించారు. దీంతో కంగుతిన్న న్యాయవాది ప్లేటు పక్కన పెట్టి.. బిక్కముఖం వేసుకొని కూర్చున్నాడు. ఎస్‌జీఐ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఆ భోజనం తనకూ పంపమని సరదాగా వ్యాఖ్యానించారు. మరోవైపు జూమ్‌కాల్‌లో ఉన్న మిగతా సభ్యులు లాయర్ చేసిన పనికి పగలబడి నవ్వారు.