క్యాన్సర్ ను జయించి.. 102 ఏళ్లు బతికి: డాక్టర్ మెక్‌గేరీ హెల్త్ సీక్రెట్
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. అయినా అవేవీ తన మనసుకు తీసుకోలేదు.. శరీరం రోగగ్రస్తమైనా రోగుల సేవలో తరించింది.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. అయినా అవేవీ తన మనసుకు తీసుకోలేదు.. శరీరం రోగగ్రస్తమైనా రోగుల సేవలో తరించింది. దేవుడు తనకో మంచి అవకాశాన్ని ఇచ్చాడు.. డాక్టర్ గా సేవలందిస్తూ ఎందరికో ప్రాణం పోయమని ఆదేశించాడు.. అందుకే ప్రాణాలు తీసే మహమ్మారి క్యాన్సర్ వంటి వ్యాధి వచ్చినా లెక్క చేయలేదు.. 102 ఏళ్ల వయసులోనూ తన డ్యూటీని తాను సక్రమంగా చేస్తూ జీవితానికి పరిపూర్ణ అర్ధాన్ని తీసుకువచ్చింది డాక్టర్ మెక్‌గేరీ.
46 ఏళ్ల వయసులో తన భర్తతో విడిపోయింది. 76 ఏళ్ల వయసులో తనకు క్యాన్సర్ సోకింది. అయినా ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. 102 ఏళ్ల వయసున్న డాక్టర్ మెక్‌గేరీ ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తోంది. వాకర్ సహాయంతో ప్రతిరోజూ 3,800 అడుగులు నడుస్తుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండడానికి తానేమీ ప్రత్యేక ఆహారం తీసుకోలేదని తెలిపింది. "చాక్లెట్ కేక్ , అప్పుడప్పుడు హాంబర్గర్‌తో సహా ఏం తినాలనుకుంటే అవన్నీ తినేదాన్నని చెప్పింది.
డాక్టర్ మెక్‌గేరీ తన జీవిత అనుభవంపై ది వెల్-లివ్డ్ లైఫ్: ఎ 102-ఇయర్-ఓల్డ్ డాక్టర్స్ సిక్స్ సీక్రెట్స్ టు హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఎట్ ఎవ్రీ ఏజ్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు మెక్‌గేరీ కొన్ని ఆరోగ్య రహస్యాలు పంచుకుంది.
నిద్రించే ముందు మీరు ఏం కోరుకుంటున్నారు వాటిని పదే పదే నెమరు వేసుకోండి.. ఆ ఆలోచనలే కలల రూపంలో వస్తాయి. వాటికి పరిష్కారాలు కూడా కలలో దొరుకుతాయి. మేల్కొన్న తర్వాత వాటిని రాసుకోండి అని చెబుతారు.
మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరికించండి. అద్భుతమైన విషయాలతో నిండి ఉందని గ్రహించండి అని అంటారు. మీకు నచ్చినట్లుగా మీ జీవితాన్ని గడపండి. అయితే అది మీకు, మీ చుట్టు పక్కల వారికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి అని అంటారు మెక్‌గేరీ.
"నేను అద్భుతమైన జీవితాన్ని గడిపాను. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా నేను దానిని ప్రేమిస్తున్నాను. బంధువులు, స్నేహితులు మాత్రమే కాదు, నేను సహాయం చేసిన, నాకు సహాయం చేసిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారందరూ నా సంతోషానికి కారకులు అని మెక్‌గేరీ ఆనందంగా చెబుతారు.