Turbulence: ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో కుదుపులు

12 మందికి గాయాలు..;

Update: 2024-05-27 01:00 GMT

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరోకటి వెలుగుచూసింది. ఖతర్‌లోని దోహా నుంచి ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు వెళ్తోన్న ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఆకాశంలో భారీ కుదుపులకు గురైంది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 12 మంది గాయపడ్డారు. ఆదివారం దోహా నుంచి డబ్లిన్‌కు బయల్దేరిన విమానం....తుర్కియే గగనతలంపై ఉండగా భారీ కుదుపులకు లోనైంది. అయినప్పటికీ ..షెడ్యూల్‌ ప్రకారమే డబ్లిన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అప్పటికే పైలట్లు సంబంధిత సమాచారాన్ని అధికారులకు చేరవేయడంతో వారు విమానాశ్రయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. డబ్లిన్‌ విమానాశ్రయం ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించింది. ఖతర్‌ ఎయిర్‌వేస్‌ సైతం కొద్దిమంది ప్రయాణికులకు, సిబ్బందికి విమానంలో స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. 

కొన్ని రోజుల క్రితం 211 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్రమైన టర్బులెన్స్‌కి గురైంది. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో చెలరేగిన అల్లకల్లోలం వల్ల 73 ఏళ్ల బ్రిటన్ ప్రయాణికుడు మరణించాడు. విమానంలోని చాలా మంది తలలకు, వెన్నుముక, మెదడు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై పరిశోధకులు పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నారని సింగపూర్ రవాణా మంత్రి తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా బోయింగ్ 777-300ER కేవలం కొన్ని నిమిషాల్లో 1,800 మీటర్లు (6,000 అడుగులు) పడిపోయిందని, చాలా మంది తమకు సీటుబెల్టు బిగించుకునే సమయం కూడా లేదని ప్రయాణికులు చెప్పారు.

ఈ ఘటన తర్వాత సింగపూర్ ఎయిర్‌‌లైన్స్ తమ విమానాల్లో సిట్ బెల్ట్ నిబంధనల్ని కఠినతరం చేసింది.యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ 2021 అధ్యయనం ప్రకారం, టర్బులెన్స్-సంబంధిత విమాన ప్రమాదాలు అత్యంత సాధారణం. 2009 నుండి 2018 వరకు నివేదించబడిన ఎయిర్‌లైన్ ప్రమాదాలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ టర్బులెన్స్ వల్లే జరిగాయని ఏజెన్సీ చెప్పింది.

Tags:    

Similar News