Zhang Qi Corruption: మాజీ మేయర్ ఇంట్లో 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల కాష్

అవినీతి అనకొండ గుట్టురట్టు..!

Update: 2026-01-04 06:30 GMT

 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. అది చూసిన ఎవరికైనా ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అవుతోంది. గది నిండా బంగారు బిస్కెట్స్, కట్టల కొద్దీ నోట్ల కుప్పలు.. ఏదైనా సినిమా సెట్టింగ్ అనుకుంటే పొరపాటే. అది ఒక ప్రభుత్వ అధికారి తన ఇంట్లో అక్రమంగా పోగేసిన ‘అవినీతి సామ్రాజ్యం’. చైనాలోని హైకౌ నగర మాజీ మేయర్ జాంగ్ క్యూ నివాసంలో బయటపడిన ఈ అక్రమ ఆస్తుల వివరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

సాధారణంగా దొంగతనాలు జరిగినప్పుడు తులాల్లోనో, కిలోల్లోనో బంగారం పోయిందని వింటుంటాం. కానీ ఇక్కడ లెక్కలు టన్నుల్లో ఉన్నాయి. 13.5 టన్నుల బంగారం.. అవును, మీరు చదివింది నిజమే. ఒక దేశ సెంట్రల్ బ్యాంక్ నిల్వలకు ఏమాత్రం తగ్గకుండా జాంగ్ క్యూ తన ఇంట్లోని రహస్య గదుల్లో టన్నుల కొద్దీ బంగారాన్ని దాచిపెట్టాడు. వీటితోపాటు అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు బరువు సుమారు 23 టన్నులు. అంటే ఆ నగదును తరలించడానికి ఏకంగా ట్రక్కులు అవసరమయ్యాయి.

అంతేకాకుండా చైనాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇతడికి బహుళ అంతస్తుల భవనాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఒక సామాన్య అధికారిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జాంగ్ క్యూ, రాజకీయంగా ఎదిగి మేయర్ స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ అక్రమాలకు తెరలేపారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ భూములను తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి బిలియన్ డాలర్ల కమీషన్లు పొందారు.

అలాగే భారీ ప్రభుత్వ ప్రాజెక్టులను తన అనుకూల వ్యక్తులకు ఇచ్చి దేశ సంపదను దోచుకున్నారు. అలాగే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లను సేకరించడం ఇతడికి ఒక వ్యసనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో 2019 నుంచి ఉన్నా.., తాజాగా ఇవి మళ్ళీ వైరల్ అవుతున్నాయి. అవినీతిపై ఉక్కుపాదం మోపే చైనా ప్రభుత్వం, జాంగ్ క్యూ విషయంలో ఏమాత్రం కనికరం చూపలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, ప్రజా విశ్వాసాన్ని వంచించినందుకు గానూ ఆయనకు మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని, ప్రతి గ్రాము బంగారాన్ని ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.

Tags:    

Similar News