Nobel Prize: ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు వైద్య‌శాస్త్రంలో నోబెల్ పుర‌స్కారం

రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌లో ‘టీ క‌ణాల‌’పై అధ్య‌య‌నం..

Update: 2025-10-06 10:00 GMT

వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఇ.బ్రున్‌కో, ఫ్రెడ్ రామ్స్‌‌డెల్, షిమన్ సకాగుచీకి అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది. వైద్య విభాగంతో ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రకటనలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి.

మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధించబడుతుందనే రహస్యాన్ని ఛేదించినందుకు గాను వీరికి ఈ పురస్కారం లభించింది. వీరి పరిశోధనలు పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనే విధానంపై దృష్టి సారించాయి. దీని ద్వారా నియంత్రిత టీ కణాలుగా పేర్కొనబడే ప్రత్యేక రోగనిరోధక కణాలు ఆటోఇమ్యూన్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించే సంరక్షకులుగా ఎలా పనిచేస్తాయో వారు తమ పరిశోధనలు గుర్తించారు.

“మేరీ ఇ. బ్రూనో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచి ముగ్గురు రోగనిరోధక వ్యవస్థ ఎలా నియంత్రించబడుతుందో పరిశోధించారు. ఈ పరిశోధనలో వారి ఆవిష్కరణల ఫలితంగా ఈ ముగ్గురినీ నోబెల్ బహుమతి వరించింది. వారి ఆవిష్కరణలు కొత్త పరిశోధనా రంగానికి పునాది వేయడంతో పాటు, క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వంటి రోగాలకు కొత్త చికిత్సల అభివృద్ధికి ప్రేరణనిచ్చాయి” అని నోబెల్ కమిటీ పేర్కొంది.

ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం తరువాత ఈ నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని వివిధ రంగాలలో బహుమతులను అందజేయడానికి వీలునామా రాశారు. 1895 నాటి ఆయన వీలునామా ప్రకారం.. “గత ఏడాదిలో, మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వారికి” బహుమతులు ప్రదానం చేయాలని ఆయన నిర్దేశించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 10న నోబెల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి. ఈ రోజున నోబెల్ బహుమతులు గ్రహీతలకు ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేశారు. నాటి నుంచి ఏటా అందజేస్తున్నారు. అప్పటి నుంచి కొన్ని సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు కొనసాగిన సమయంలో నోబెల్ బహుమతులు ఇవ్వలేదు.

Tags:    

Similar News