Israel : హమాస్ చెరలోనే మగ్గుతున్న బందీలు
షబ్బత్ డిన్నర్‌లో దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు;
హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో చాలామంది ప్రాణాలతోనే ఉన్నారని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. బందీల్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారని ప్రకటించింది.ఇదేసమయంలో ఇజ్రాయెల్‌లోయూదులు పవిత్రంగా జరుపుకునే షబ్బత్ డిన్నర్‌లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాల్సిన షబ్బత్ డిన్నర్‌లో హమాస్ దాడితో విషాద వాతావరణం నెలకొంది.
గాజాలో హమాస్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్న వారిలో..ఎక్కువ మంది సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. బందీల్లో 20 మంది చిన్నారులు 10 నుంచి 20 మంది వృద్ధులు ఉన్నారని తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పైకి మెరుపుదాడికి దిగిన హమాస్ దాదాపు 200 మంది ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులను బందీలుగా తీసుకెళ్లింది. హమాస్ చెర నుంచి బందీలను కాపాడేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. గాజా భూభాగంలో గ్రౌండ్ ఆపరేషన్‌కు ప్రభుత్వం అనుమతి లభించడంతో హమాస్ సభ్యులను ఏరివేసే వ్యూహాల్లో సైన్యం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల కుటుంబాలు వారి సంప్రదాయంలో భాగంగా శుక్రవారం సూర్యాస్తమయం తరవాత షబ్బత్ విందు జరుపుకుంటారు. కానీ హమాస్ దాడితో వందలాది ప్రజలు మరణించగా... మరికొందరు హమాస్ చెరలో బందీలయ్యారు. ఇజ్రాయెల్‌లో షబ్బత్ విందులో కుర్చోవాల్సిన వారు..బందీలుగా మారడంతో, వందలాది కుటుంబాల్లో విషాదం నింపుతూ.. ఈ డిన్నర్‌లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. టెల్ అవీవ్ మ్యూజియం ప్లాజా వద్ద.. షబ్బత్ డిన్నర్ టేబుల్ ఏర్పాటు చేశారు. అందులో 200 స్థానాల్లో ఖాళీ కుర్చీలను నిర్వాహకులు ఏర్పాటు చేసి..బందీలకు సంఘీభావం తెలిపారు.
ఇదే సమయంలో తమ వద్ద ఉన్న బందీల్లో అమెరికాకు చెందిన ఇద్దరిని మానవతా ధృక్పథంతో విడిచిపెట్టినట్లు హమాస్ ప్రకటించింది. తల్లి, ఆమె కుమార్తెను హమాస్‌కు చెందిన అల్-ఖస్సామ్ బ్రిగెడ్ విడుదల చేసినట్లు పేర్కొంది. ఐతే వారిని ఎలా, ఎప్పుడు విడుదల చేసిందీ వివరాలను మాత్రం వెల్లడించలేదు.