Boat capsize: పడవ బోల్తా పడి 25 మంది మృతి , చాలామంది .. సాకర్ ఆటగాళ్ళే
కాంగోలో విషాద ఘటన;
కాంగో పశ్చిమ ప్రావీన్సులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్వా నదిలో పడవ బోల్తా పడి 25 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గల్లంతయ్యారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సాకర్ ఆటగాళ్లే ఉన్నారు. ముషి పట్టణంలో మ్యాచ్ ఆడి ఇతర ప్రయాణికులతో కలిసి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవ నీటిలో మునిగి పోయిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ముసాషి ఓడరేవు నుంచి బోటు బయలుదేరిన కాసేపటికే బోల్తా పడినట్టు తెలిపాయి. రాత్రి పూట దృశ్యమానత సరిగా లేకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
కాంగోలోని నదులు 100 మిలియన్లకు పైగా ప్రజలకు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయి. అయితే రాత్రిపూట ప్రయాణాలు, రద్దీగా ఉండే ఓడలపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని పలువురు భావిస్తున్నారు. ఈ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగో కొంతకాలంగా అంతర్గత తిరుగుబాటుతో పోరాడుతోంది. తూర్పు కాంగో నగరమైన గోమాలో సైన్యానికి, తిరుగుబాటు గ్రూపు ఎం23కి మధ్య చాలా రోజులు ఘర్షణ జరుగుతోంది. దీని కారణంగా లక్షలాది మంది దేశాన్ని వీడి వలస వెళ్తున్నారు.