Pakistan: పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన.. 331 మంది పిల్లలకు HIV
రహస్య కెమెరాతో అసలు విషయాలు వెలుగులోకి.
అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి అండగా నిలుస్తూ.. మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సి వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా వందలాది మంది చిన్నారుల జీవితాలు నాశనం అయ్యాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది.. ఒకే సిరంజీని పదేపదే వాడటం వల్ల ఏకంగా 331 మంది చిన్నారులు ప్రాణాంతక హెచ్‌ఐవీ బారిన పడ్డారు. బీబీసీ ప్రతినిధులు చేపట్టిన రహస్య విచారణలో బయటపడిన ఈ దిగ్భ్రాంతికర వాస్తవాలు.. ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంస్థలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..
పాకిస్థాన్‌లోని టిహెచ్‌క్యూ ఆసుపత్రి టౌన్సాలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ వైఫల్యాలను తాజాగా బీబీసీ వెలుగులోకి తెచ్చింది. 2024 నవంబర్ నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో చిన్నారులకు హెచ్‌ఐవీ సోకడంపై స్ధానిక వైద్యుడు డాక్టర్ గుల్ కైస్రానీ అనుమానం వ్యక్తం చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో తేలిన గణాంకాల ప్రకారం.. కనీసం 331 మంది చిన్నారులు కేవలం ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే వైరస్ బారిన పడ్డారు.
రహస్య కెమెరాతో అసలు విషయాలు వెలుగులోకి..!
ఆసుపత్రిలో సుమారు 32 గంటల పాటు చిత్రీకరించిన రహస్య ఫుటేజీ ద్వారా సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వారంతా అత్యంత ప్రమాదకర పద్ధతులను పాటిస్తున్నట్లు వెల్లడి అయింది. ఒక రోగికి వాడిన సిరంజీనే తిరిగి మందు సీసాల్లో ముంచుతూ.. అదే మందును వేరే పిల్లలకు ఎక్కించడం కనిపించింది. దీని వల్లే అంత మంది పిల్లలకు హెచ్ఐవీ సోకి ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. ముఖ్యంగా సూది మార్చినా.. సిరంజీ వెనుక భాగంలో వైరస్ నిల్వ ఉంటుందని.. అది మొత్తం మందు బ్యాచ్‌ను కలుషితం చేస్తుందని వివరిస్తున్నారు. అలాగే వాడిన సూదులను కౌంటర్లపైనే వదిలేయడం, గ్లౌజులు లేకుండానే ఇంజెక్షన్లు ఇవ్వడం వంటి ఘోర తప్పిదాలు కూడా ఈ రహస్య వీడియోల్లో వెలుగులోకి వచ్చాయి.