అమెజాన్ ఫారెస్ట్ లో కూలిన విమానం.. 17 రోజులకు సజీవంగా దొరికిన నలుగురు చిన్నారులు
అమ్మ కనిపించకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేని చిన్నారులు.. ఎవరూ కనిపించని ఆ అడవిలో 17 రోజులు ఉన్నారు.
అమ్మ కనిపించకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేని చిన్నారులు.. ఎవరూ కనిపించని ఆ అడవిలో 17 రోజులు ఉన్నారు. చుట్టూ అడవి.. ఏ జంతువు వచ్చి ఏం చేస్తుందో తెలియదు.. తమ కోసం ఎవరొస్తారు.. ఏం చేయాలి. ఇవేవీ తెలియకుండానే 17 రోజులు గడిపేశారు..మే 1 తెల్లవారుజామున ఇంజిన్ వైఫల్యం కారణంగా అమెజాన్ ఫారెస్ట్ లో ఏడుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది.
కొలంబియాలోని దట్టమైన అడవిలో వారు ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన రెండు వారాల తర్వాత ఒక శిశువుతో సహా నలుగురు పిల్లలు సజీవంగా ఉన్నారని అధ్యక్షుడు గుస్తావో పెట్రో చెప్పారు. దట్టమైన అడవిలో మిలిటరీ సభ్యులు, అగ్నిమాపక సిబ్బంది, పౌర విమానయాన అథారిటీ అధికారులు పిల్లలను రక్షించారు.
మే 1న దక్షిణ కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో అదృశ్యమైన నలుగురు చిన్నారులను మా మిలిటరీ బలగాలు కఠోరమైన గాలింపు ప్రయత్నాల తర్వాత సజీవంగా కనుగొన్నామని అధికారి ట్విట్టర్‌లో తెలిపారు.
తోబుట్టువులు నలుగురు.. 11 నెలలు, 4 మరియు 9 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలు, వారి 13 ఏళ్ల సోదరి రెస్క్యూ టీమ్ తో మాట్లాడుతూ.. అడవిలో దొరికే పండ్లు తినడం ద్వారా ఆకలి తీర్చుకున్నామని పేర్కొంది.
ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ముగ్గురు పెద్దలు మరణించగా, వారి మృతదేహాలు విమానంలోనే లభ్యమయ్యాయి. చనిపోయిన వారిలో ఒకరైన రానోక్ ముకుటుయ్ నలుగురు పిల్లలకు తల్లి.
100 కంటే ఎక్కువ మంది సైనికులు స్నిఫర్ డాగ్‌లతో విమానం ల్యాండ్ అయిన ప్రాంతంలో అడవి మార్గంలో నడిచి ఎట్టకేలకు నలుగురు పిల్లలను కనుగొన్నారు. అంత చిట్టడవిలో అర్థరాత్రి పూట వారంతా సురక్షితంగా ఎలా ఉన్నారని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా నలుగురు చిన్నారులు సజీవంగా ఉన్నందుకు ఊపిరి పీల్చుకున్నారు. కొలంబియా అధికారులు విమాన ప్రమాదానికి గల కారణాన్ని ఇంకా వెల్లడించలేదు.