Israel-Hamas war: కొత్త సంవత్సరానికి బాంబుతో ప్రారంభం.. 48 మంది మృతి
నూతన సంవత్సరం తొలిరోజే ఊహించని పరిణామం;
గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు నూతన సంవత్సరం తొలిరోజే ఊహించని పరిణామం ఎదురైంది. దాదాపు మూడు నెలలుగా గాజాపై బాంబు దాడులతో ఇజ్రాయెల్ విరుకుపడుతుండగా...ఇవాళ హమాస్ చెలరేగింది. కొత్త సంవత్సరం వేళ వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడింది. అక్టోబర్ 7 ఘటన తర్వాత మరోసారి పెద్ద ఎత్తు రాకెట్లను ప్రయోగించింది.
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు నూతన సంవత్సరం తొలిరోజే అనూహ్య ఘటన ఎదురైంది. ఈ ఉదయం గాజా నుంచి వందలాది రాకెట్లు ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చాయి. వాటిని ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోగా పెద్ద ఎత్తున శబ్దాలతో ఆకాశంలో పేలుళ్లు సంభించాయి. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఈ రాకెట్లు పడినట్టు తెలుస్తోంది. రాకెట్‌లు తమ భూభాగం వైపు దూసుకొస్తున్న క్రమంలో అప్రమత్తమైన ఇజ్రాయెల్ అధికారులు హెచ్చరిక సైరన్‌లను మోగించారు. వందలాది రాకెట్లతో హమాస్ విరుచుకుపడ్డప్పటికీ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్ 7 న ఇజ్రాయెల్‌పై 2 వేల రాకెట్లతో హమాస్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ సరిహద్దులను ధ్వంసం చేసి ఆ దేశంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు బీభత్సం సృష్టించారు.ఆ సమయంలో హమాస్ జరిపిన దాడుల్లో 12 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 240 మందిని హమాస్ మిలిటెంట్లు బంధించి తీసుకెళ్లారు. ఆ ఘటన తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అయితే తాజాగా హమాస్ మిలిటెంట్లు ప్రతిదాడులు చేశారు. గాజా నుంచి వందలాది రాకెట్లు ఇజ్రాయెల్ వైపు ప్రయోగించారు.
మరోవైపు కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి వస్తున్నప్పటికీ గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది. దక్షిణ, సెంట్రల్ గాజా ప్రాంతాల్లో భీకర దాడులు చేస్తోంది. ఆదివారం నాటి ఇజ్రాయెల్ దాడుల్లో 35 మంది తమ పౌరులు మరణించారని గాజా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 21 వేల 800లకు చేరిందని పేర్కొన్నారు. అటు హమాస్ దాడుల్లో 12 వందల మంది తమ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఇప్పటికే తెలిపిన ఇజ్రాయెల్....దాడుల్లో 172 మంది సైనికులు మరణించారని పేర్కొంది