అమెరికాలో హాలోవీన్ వేడుకలు అట్టహాసంగా సాగాయి. 50వ హాలోవీన్ వేడుకలను అక్కడి పౌరులు ఘనంగా నిర్వహించుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఈ ప్రదర్శనను చూసేందుకు పౌరులు భారీగా హాజరయ్యారు. మంత్రగత్తెలు, తాంత్రికులు, దెయ్యాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన వేడుకలకు US ఫస్ట్‌లేడీ జిల్‌బైడెన్ వినూత్న వేషధారణతో హాజరయ్యారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో హాలోవీన్ 50వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వింతైన వేషధారణలు, అమ్మో అనిపించే ఆకారాలు, వినూత్న మేకప్‌లతో న్యూయార్క్ వీధుల్లో హాలోవీన్ పరేడ్ అట్టహాసంగా జరిగింది. న్యూయార్క్‌లో జరిగిన వేడుకను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మంత్రగత్తెలు, దెయ్యాలు, రాక్షసులు, జంతువుల వంటి మేకప్‌తో వచ్చిన ప్రదర్శనకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈసారి అప్‌సైడ్ డౌన్, ఇన్‌సైడ్ ఔట్ థీమ్‌తో ఈ ఉత్సవాలను ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. కోవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత సాధారణ జీవితాన్ని సూచించేలా థీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ భయాన్ని గుర్తు చేసుకున్న పౌరులు ఇప్పుడు నిర్భయంగా స్వేచ్ఛగా ఉన్నామని వివరించారు. ప్రదర్శనకారులే కాకుండా పౌరులంతా వినూత్న వేషధారణలతో.. పరేడ్‌ను తిలకించేందుకు వచ్చారు.
ఈ హాలోవీన్ ప్రదర్శనకు ప్రసిద్ధ జర్మన్ మోడల్ హెడీక్లమ్, ఆమె బృందం వావ్ అనిపించే వేషధారణతో వచ్చారు. పురి విప్పిన నెమలిని తలపించే దుస్తులను ధరించి ప్రదర్శన చేశారు. ఈ షోలోఆమె భర్త టామ్ కౌలిట్జ్ కోడి గుడ్డు వంటి దుస్తులు ధరించాడు.
శ్వేతసౌధంలోనూ హాలోవీన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్‌బైడెన్ తన పెంపుడు పిల్లి విల్లో లాగా ముస్తాబయ్యారు. వైట్‌హౌస్‌లో హల్లో రీడ్ థీమ్‌తో నిర్వహించిన వేడుకలకు బైడెన్ దంపతులు ఆతిథ్యమిచ్చారు.ఈ కార్యక్రమంలో పిల్లలకు క్యాండీలు, స్వీట్లతో పాటు పిల్లల్లో ప్రసిద్ధ సాహిత్య పాత్రలు, ఘోలిష్, దెయ్యం కథల పుస్తకాలను బహూకరించారు