నూడిల్స్ ఎంత పని చేశాయి.. 8 మందిని మృత్యుఒడికి..
అదే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు నూడిల్స్ నచ్చక తినకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.;
ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకొవచ్చు అని కొన్ని ప్రొడక్ట్స్ కొనేటప్పుడు చెబుతుంటారు. దాదాపుగా అందరిళ్లలో ఫ్రిజ్ నిండిపోయే ఉంటుంది. కొన్ని సార్లు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు తిని అనారోగ్యం పాలైన సంఘటనలు వింటూ ఉంటాము. చైనాలోని హీలాంగ్జియాంగ్ నార్త్ ఈస్ట్రన్ ప్రావిన్స్‌లోని జిసి నగరానికి చెందిన ఓ కుటుంబం దాదాపు సంవత్సరం పాటు ఫ్రిజ్‌లో వండి పెట్టిన నూడిల్స్ తిని 9 మంది అస్వస్థతకు గురయ్యారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 8 మంది మృత్యువాత పడ్డారు. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు నూడిల్స్ నచ్చక తినకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై హీలాంగ్జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కు చెందిన ఫుడ్ సేప్టీ డైరెక్టర్ గావో పీయ్ మాట్లాడుతూ బాంగ్‌క్రెక్ అనే విషం కారణంగానే వారు మృత్యువాత పడ్డారు. చెడిపోయిన పదార్థాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. బాంగ్‌క్రెక్ మన శరీరంలో చేరిన వెంటనే దాని ప్రభావం చూపుతుంది.
కడుపునొప్పి, చెమటలు పట్టడం, నీరసం, కోమాలోకి వెళ్లడం.. 24 గంటల్లో మరణం కూడా సంభవించవచ్చు. ఆ విషం మన శరీరంలోని కీలక అవయవాలైన కిడ్నీలు, లివర్, గుండె బ్రెయిన్‌ను దెబ్బతీస్తుంది. ప్రస్తుతం దానికి విరుగుడు మందు లేదు. ఒక సారి విషం మన శరీరంలోకి చేరితే మరణించే అవకాశాలు 40-100 శాతం వరకు ఉన్నాయి. ఈ పదార్థాలను ఎంత వేడి చేసినా బాంగ్‌క్రెక్ నశించదు. కొబ్బరికి సంబంధించిన పదార్థాలు ఎక్కువ రోజులు పులియబెట్టడం వల్ల ఉత్పత్తి అవుతుంది.