AFG: అఫ్గానిస్తాన్‌తో అంత ఈజీ కాదు
అఫ్గానిస్థాన్‌ను ఓడించడం అంత తేలిక కాదు.. సోవియట్, బ్రిటన్, అమెరికాకే సాధ్యం కాలేదు.. "సామ్రాజ్యాల స్మశానవాటిక"గా అఫ్గాన్‌కు పేరు
పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకున్నాయి. ఇటీవల సరిహద్దు ఘర్షణల తర్వాత 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంలో రెండు పక్షాల మధ్య చర్చలు జరుగుతాయనే అంచనాలు వచ్చాయి. మరోవైపు రెండు దేశాల మధ్య వివాదం మరింత పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. భారతదేశంలో పర్యటించిన అఫ్గానిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాకీ చేసిన ప్రకటన కూడా చర్చనీయమైంది. ఆయన పాకిస్తాన్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఒక హెచ్చరిక జారీ చేశారు. ముత్తాకీ మాట్లాడుతూ.. ‘అఫ్గాన్ల ధైర్యాన్ని పరీక్షించవద్దు. మీరు ఇలాంటిది చేయాలనుకుంటే, మొదట బ్రిటన్ను అడగండి, సోవియట్ యూనియన్ను అడగండి, అమెరికా, నేటోను అడగండి. అఫ్గానిస్తాన్‌తో ఆటలాడకపోవడమే మంచిదని వారు మీకు అర్థమయ్యేలా చెప్తారు’ అని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి అన్నారు. అఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఇటీవల అలాంటి హెచ్చరికే చేశారు. ప్రపంచంలోని గొప్ప శక్తులు, అగ్రరాజ్యాలు కూడా తగిన ఆర్మీ కానీ, సైనిక వనరులు కానీ లేని అఫ్గానిస్తాన్‌ను ఓడించలేకపోయాయి. 'సామ్రాజ్యాల స్మశానవాటిక' అని అఫ్గానిస్తాన్‌కు పేరు ఉంది.
సామ్రాజ్యాల స్మశానవాటిక అఫ్గాన్
19వ శతాబ్దంలో.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ బ్రిటన్ చివరకు 1919లో అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టి, అఫ్గాన్ పౌరులకు స్వాతంత్ర్యం ఇచ్చింది. ఆ తర్వాత 1979లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌పై దండెత్తింది. 1978లో తిరుగుబాటు ద్వారా స్థాపించిన కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోకుండా ఆపడం దాని లక్ష్యం. కానీ అఫ్గానిస్తాన్‌తో యుద్ధంలో గెలవలేమని గ్రహించడానికి వారికి పదేళ్లు పట్టింది. బ్రిటిష్ సామ్రాజ్యం, సోవియట్ యూనియన్ మధ్య కొంత సారూప్యత ఉంది. అఫ్గానిస్తాన్‌పై దండెత్తినప్పుడు రెండు సామ్రాజ్యాలు అత్యంత శక్తిమంతంగా ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌పై దండయాత్ర తర్వాత, ఆ రెండు సామ్రాజ్యాలు క్రమంగా దెబ్బతినడం మొదలైంది. 2001లో అఫ్గానిస్తాన్‌పై అమెరికా దండయాత్ర ఫలితంగా సంవత్సరాల పాటు సాగిన యుద్ధంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరవై సంవత్సరాల తర్వాత, అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అఫ్గానిస్తాన్ నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమెరికా సైన్యం ఉపసంహరణకు, తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది. ఇలా ఎవరూ కూడా అఫ్గాన్‌ను గెలవలేకపోయారు.