Afghanistan : ఆఫ్గాన్‌లోని జర్నలిస్టుల పరిస్థితి దారుణం... !
తమకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై కక్షగడుతున్న తాలిబన్లు.. వేటాడి చంపేస్తున్నారు. ఆ మధ్య ఓ జర్మనీ జర్నలిస్టు బంధువును హతమార్చారు.;
ఆఫ్గాన్‌లోని జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా మారుతోంది. ఓవైపు తాలిబన్ల దాడులు పెరిగిపోతున్నాయి. తమకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై కక్షగడుతున్న తాలిబన్లు.. వేటాడి చంపేస్తున్నారు. ఆ మధ్య ఓ జర్మనీ జర్నలిస్టు బంధువును హతమార్చిన తాలిబన్లు.. రీసెంట్‌లో మరో జర్నలిస్టును దారుణంగా కొట్టి హింసించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడబోం అంటూనే పౌరులు, మీడియా ప్రతినిధులతో పాటు ప్రముఖులపై దాడులు చేస్తున్నారు. దీంతో ఆఫ్గాన్ నుంచి బయటపడేందుకు 2వేల మంది జర్నలిస్టులు పోటీ పడుతున్నారు. కాని, తాలిబన్లు మాత్రం కాబూల్ ఎయిర్‌పోర్టుకు జర్నలిస్టులు రాకుండా అడ్డుకుంటున్నారు.
ఆఫ్గాన్‌నుంచి బయటపడేయాలంటూ అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్‌కు జర్నలిస్టులు మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఆ జర్నలిస్టులను కాబూల్ ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా చేరుకునేలా రక్షణ కల్పించాలంటూ తాలిబన్లను సంప్రదించింది ఐఎఫ్‌జే. రేపు ఒక్క రోజు దాటితే.. తాలిబన్లు ఎవరి మాటా వినకపోవచ్చు. ఆఫ్గాన్ విడిచి వెళ్లాల్సిన డెడ్‌లైన్ రేపటితో ముగుస్తుండడంతో.. తాలిబన్ల అరాచకాలు మితిమీరుతాయన్న భయాలు వెంటాడుతున్నాయి.
పైగా ఆఫ్గాన్ నుంచి అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తర్వాత పరిస్థితులు అదుపు తప్పాయి. ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులను దాదాపుగా తరలించేశాయి. మరికొన్ని దేశాలు రేపటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఆఫ్గాన్‌లోని వివిధ మీడియా సంస్థలకు చెందిన 2వేల మంది సిబ్బంది.. ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ఐఎఫ్‌జేకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి వీసాలు జారీ చేయాలని స్పెయిన్, ఫ్రాన్స్, మెక్సికో, ఇటలీ, జర్మనీ, బ్రిటన్, అమెరికా, కెనడాతో పాటు మరికొన్ని దేశాలకు ఐఎఫ్‌జే విజ్ఞప్తి చేసింది. కాని, ఒక్కో దేశం కేవలం 10 నుంచి 15 జర్నలిస్టులకు మాత్రమే ఆశ్రయం కల్పిస్తామని చెబుతున్నాయి.