Tanzania: భారీ వ‌ర్షాల‌కు తూర్పు ఆఫ్రికా అత‌లాకుత‌లం

టాంజానియాలో 155 మంది మృతి

Update: 2024-04-27 01:15 GMT

తూర్పు ఆఫ్రికా దేశాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు టాంజానియా , కెన్యా, బురుండీల్లో వరదలు సంభవించాయి. దీంతో ఆయా దేశాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. పలు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు టాంజానియా దేశంలో సుమారు 155 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రధాని కాసిమ్‌ మజాలివా (Prime Minister Kassim Majaliwa) తాజాగా వెల్లడించారు. బలమైన గాలులు, వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పంట నష్టంతోపాటు రోడ్లు, వంతెనలు, రైల్వేలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పలు చోట్ల కొండచరియలు కూడా విరిగిపడినట్లు చెప్పారు. ఈ వర్షాల కారణంగా సుమారు 236 మంది గాయాలపాలైనట్లు తెలిపారు.

"ఎల్‌నినో కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బలమైన గాలులు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇవి ప్రాణనష్టం, పంటలు, గృహాలు, పౌరుల ఆస్తుల విధ్వంసంతో పాటు రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలను కూడా దెబ్బ తీశాయి. ఫలితంగా 51వేల‌ కంటే ఎక్కువ ఇళ్లు, 2ల‌క్ష‌ల‌ మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 155 మంది మృతిచెందారు. అలాగే సుమారు 236 మంది గాయపడ్డారు" అని టాంజానియా రాజధాని డోడోమాలోని పార్లమెంట్‌లో ప్రధాని కాసిమ్ మజలివా చెప్పారు.

51 వేలకు పైగా ఇల్లు ధ్వంసమయ్యాయని, సుమారు రెండు లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారని ప్రధాని కాసిమ్‌ పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్‌ సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. మే నెలలో కూడా వర్షాలు కొనసాగుతాయని కాసిమ్‌ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభావిత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

ఇక టాంజానియా పొరుగు దేశాలైన కెన్యా, బురుండీలలో కూడా భారీ వర్షాల కారణంగా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కెన్యాలో వర్షాల కారణంగా 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఆఫ్రికా ప్రాంతం ప్రస్తుత వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.గతేడాది చివర్లో కెన్యా, సోమాలియా, ఇథియోపియాలో కుండపోత వర్షాలు మరియు వరదల కారణంగా 300 మందికి పైగా చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఇక అక్టోబర్ 1997 నుండి జనవరి 1998 వరకు భారీ వరదలు ఈ ప్రాంతంలోని ఐదు దేశాలలో 6వేల‌ కంటే ఎక్కువ మందిని పొట్ట‌న బెట్టుకున్నాయి.

Tags:    

Similar News