Bangladesh: దేశంలో ఆగని హింస.. రాక్ కచేరీ ధ్వంసం
బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌లో ఒక పాఠశాల వార్షికోత్సవం గందరగోళంలో ముగిసింది. రాక్ లెజెండ్ జేమ్స్ నిర్వహించిన కచేరీపై దాడి చేయడంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు.
బంగ్లాదేశ్‌లోని ఒక చారిత్రాత్మక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రముఖ రాక్ సంగీతకారుడు జేమ్స్ కచేరీ ఏర్పాటు చేశారు స్కూలు యాజమాన్యం. అయితే ఇస్లామిక్ గుంపు దాడి చేయడంతో కార్యక్రమం రసాభాసగా మారింది. నిర్వాహకులు ప్రదర్శనను అకస్మాత్తుగా రద్దు చేయవలసి వచ్చింది. ఈ ఘటనలో కనీసం 20 మంది గాయపడ్డారు.
బంగ్లాదేశ్‌లో అతిపెద్ద రాక్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నాగర్ బౌల్ జేమ్స్, ఫరీద్‌పూర్ జిల్లా స్కూల్ 185వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చారు. వేలాది మంది విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ కచేరీపై కొందరు వ్యక్తులు వేదికపైకి వచ్చారు. వేదిక మొత్తం వాళ్లే ఆక్రమించారు. దాంతో కచేరీ ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందే రద్దు చేయబడింది.
భద్రతా సిబ్బంది మరియు నిర్వాహకులు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ బృందం హింసాత్మకంగా మారింది. వేదికపైకి, ప్రేక్షకుల వైపుకు ఇటుకలు, రాళ్ళు విసిరివేయడంతో మైదానంలో భయాందోళనలు చెలరేగాయి. గాయపడిన వారిలో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులు.
ఇటుకలతో దాడి చేయడంతో అనేక మంది తలలకు గాయాలయ్యాయి. విద్యార్థులు దాడి చేసిన వారిని ప్రతిఘటించారని తెలుస్తోంది.
పరిస్థితి విషమించడంతో, జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ముస్తాఫిజుర్ రెహమాన్ షమీమ్, శాంతిభద్రతలపై ఆందోళనలను చూపుతూ, ఫరీద్‌పూర్ జిల్లా యంత్రాంగం సూచనల మేరకు కచేరీని రద్దు చేస్తున్నట్లు వేదికపై నుండి ప్రకటించారు.
ఆ గందరగోళం మధ్య జేమ్స్ తృటిలో తప్పించుకున్నాడు. భద్రతా రక్షణలో వేదిక దిగి వెళ్లిపోయాడు. కళాకారుడికి లేదా అతని బ్యాండ్ సభ్యులకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
మీడియా ఉప కమిటీ కన్వీనర్ రాజిబుల్ హసన్ ఖాన్ మాట్లాడుతూ, నిర్వాహకులు కచేరీకి అన్ని సన్నాహాలు పూర్తి చేశారని, అయితే ఆకస్మిక హింసతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు.
"ఈ దాడి ఎవరు చేశారో, ఎందుకు చేశారో మాకు ఇంకా తెలియదు. మరింత హింస జరగకుండా నిరోధించడానికి ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది" అని ఆయన అన్నారు.
సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా డిమాండ్లు
స్థానిక కథనాలు ప్రకారం, దాడి చేసిన వ్యక్తులు సంగీత, సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణను వ్యతిరేకిస్తూ, అలాంటి కార్యక్రమాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తుల గుర్తింపులు లేదా అనుబంధాలను అధికారులు అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఈ సంఘటన దేశంలోని కొన్ని ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాల పట్ల పెరుగుతున్న అసహనంపై విస్తృత ఆందోళనను రేకెత్తించింది.
కచేరీ రద్దు చేయబడిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును నిర్వహించారు. 1840లో బ్రిటిష్ పాలనలో స్థాపించబడిన ఫరీద్‌పూర్ జిల్లా పాఠశాల 185 సంవత్సరాల వేడుకలను జరుపుకునే రెండు రోజుల కార్యక్రమంలో ఈ కచేరీ ముగింపు కార్యక్రమం.