Travel Agents: నకిలీ ట్రావెల్‌ ఏజెంట్లతో జాగ్రత్త..

ప్రవాసులకు భారత రాయబార కార్యాలయం హెచ్చరిక;

Update: 2024-08-10 03:30 GMT

అమెరికాలోని ప్రవాస భారతీయులు మోసపూరిత ట్రావెల్‌ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు కాన్సుల్‌ జనరల్‌ బినయ ప్రధాన్‌ ఒక ప్రకటన జారీ చేశారు.

అనైతిక కార్యకలాపాలకు ఒడిగట్టే ట్రావెల్‌ ఏజెంట్ల వలలో పడవద్దని ఇక్కడి భారత దౌత్య కార్యాలయం ఓ హెచ్చరికను జారీ చేసింది. భారత సంతతివారి కోసం వీసా, పాస్‌పోర్ట్‌ తదితర సేవలను సులువుగా, క్రమబద్ధంగా అందుబాటులోకి తెచ్చామని తెలిపింది. ట్రావెల్‌ ఏజెంట్లు ఇలాంటి సేవలకు ఎక్కువ రుసుములు పిండుకొంటున్నారని భారత దౌత్యాధికారి వినయ్‌ ప్రధాన్‌ విలేఖరులకు చెప్పారు. ప్రవాస భారత సంతతి (వోసీఐ) కార్డు ఉన్నవారు మాతృదేశానికి వెళ్లాలంటే ఎమర్జెన్సీ ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది.

కేవలం 17 డాలర్ల రుసుం చెల్లించాల్సిన ఈ సేవకు ట్రావెల్‌ ఏజంట్లు 450 డాలర్లు వసూలు చేస్తున్నారని ప్రధాన్‌ చెప్పారు. దరఖాస్తుదారుకు తెలియకుండా బోగస్‌ గుర్తింపు కార్డులు, చిరునామాలు, విద్యుత్తు, గ్యాస్‌ బిల్లులను ట్రావెల్‌ ఏజంట్లు సమర్పిస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయన్నారు. ఇది భారత్, అమెరికా రెండింటిలోనూ చట్ట విరుద్ధమైనందున దరఖాస్తుదారులు చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. భారత సంతతివారికి ఏ పౌరసత్వం ఉన్నా వారు నేరుగా తమ దౌత్య కార్యాలయానికి వచ్చి కావలసిన సేవలు పొందవచ్చని తెలిపారు. దీనికి ఏజంట్లు కానీ, వారికి డబ్బు చెల్లించాల్సిన అవసరం కానీ లేదన్నారు. వీసా, పాస్‌పోర్ట్‌ తదితర సేవలను అందిస్తామంటూ వెలసిన నకిలీ ఆన్‌లైను ఈ-వీసా సైట్ల విషయంలోనూ అప్రమత్తంగా మెలగాలని ప్రధాన్‌ సలహా ఇచ్చారు. దరఖాస్తుదారులు అధికారిక ఈ-వీసా వెబ్‌సైటును మాత్రమే ఉపయోగించాలన్నారు. అమెరికాలో 54 లక్షలమంది భారత సంతతివారు నివసిస్తున్నారని చెప్పారు. వారిలో 25 లక్షలమంది ఈశాన్య అమెరికాలోని 10 రాష్ట్రాల్లో ఉంటున్నారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న 3,54,000 మంది భారతీయ విద్యార్థుల్లో 1,13,000 మంది ఈ 10 రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లోనే చదువుకొంటున్నారు.

Tags:    

Similar News