Turkey : టర్కీలో ఉగ్రవాదుల దాడి..
పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు ఆత్మాహుతిదాడి..ఇద్దరు పోలీసులకు గాయాలు;
టర్కీ రాజధాని అంకారా నడిబొడ్డున ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ భవనం వెలుపల, మంత్రిత్వ శాఖ భవనాలకు ముందు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడ్డారని టర్కీ అంతర్గత మంత్రి ఆదివారం చెప్పారు. వేసవి విరామం తర్వాత పార్లమెంట్ తిరిగి తెరవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది . టర్కీ పార్లమెంట్ సమీపంలోకి కారులో వచ్చిన ఉగ్రవాది పార్లమెంట్ సమీపంలో కారులను పార్కింగ్ చేసి పార్లమెంట్ గేట్ వద్దకు వేగంగా పరిగెత్తాడు. దీంతో అక్కడ ఉన్నబద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో టెర్రరిస్ట్ మృతి చెందగా ఇద్దరు పోలీస్ అధికారులు స్వల్పంగా గాయపడ్డారు.
ఆత్మాహుతి దాడి జరుగుతున్న సమయంలో అసలు భద్రతా సిబ్బందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో వారు ఎదురుగా ఎవరు ఉన్నారనేది చూడకుండా కాల్పులు జరిపారు. వారు కాల్పులు జరిపే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా దేశ రాజధాని టర్కీలో ఇంకా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని ఆ దేశ ఆధికారులు అంటున్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ దాడి తర్వాత టర్కీ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోని ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీ చేస్తోంది. సిటీ సెంటర్ లోకి వెళ్లే అన్ని దారుల్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యత వహిస్తున్నట్లు కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పికెకె) ఆదివారం ప్రకటించింది. పీకేకే మిలిటెంట్ గ్రూప్‌కు సన్నిహితంగా ఉండే ఏఎన్‌ఎఫ్ న్యూస్, ఈ బాంబు దాడిని పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన 'ఆత్మాహుతి దాడి'గా అభివర్ణించింది. ఈ దాడిపై టర్కీ న్యాయ మంత్రి యిల్మాజ్ టున్ మాట్లాడుతూ.. ఈ ఆత్మాహుతి దాడిపై దర్యాప్తును అంకారా చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రారంభించిందని చెప్పారు. దాడిని ఖండిస్తూ, గాయపడిన పోలీసు అధికారులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దాడులు ఉగ్రవాదంపై టర్కీ పోరాటాన్ని ఏవిధంగానూ అడ్డుకోలేవని చెప్పారు. ఉగ్రవాదంపై మా పోరాటం మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పారు.