Afghanistan: కాబూల్‌ ఎయిర్‎పోర్ట్ వద్ద భారీ పేలుడు

Blast in Kabul: ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో తరలింపు ప్రక్రియ జరుగుతుండగా కాబూల్‌ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది.

Update: 2021-08-26 14:36 GMT

representational photo

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడ ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆదేశంలో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాలిబన్ల పాలనకు భయపడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకి మహిళలపై దాడులు ఎక్కువైపోయాయి. అమెరికా దళాలు ముందుగా ప్రకటించిన తేదీలోగా అఫ్గాన్‌ను దాటి వెళ్లకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని తాలిబన్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో తరలింపు ప్రక్రియ జరుగుతుండగా.. కాబూల్‌ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. అమెరికా రక్షణ శాఖ ఆత్మాహుతి దాడిగా భావిస్తుంది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

కాబూల్‌ ఎయిర్ పోర్టు వెలుపల ఆత్మాహుతి దాడులు జరగొచ్చని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. బ్రిటన్‌, ఆస్ట్రేలియా సైతం ఈ హెచ్చరికలను సమర్థించాయి. అఫ్గాన్‌ను వీడి వెళ్లాలని కాబూల్‌ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న పౌరులు ఆ పరిసరాలను వీలైనంత త్వరగా వీడాలని హెచ్చరికల్లో అమెరికా పేర్కొంది. అక్కడికి కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెంటగాన్‌ అధికారులు సమాచారమిచ్చారు. పేలుడు వెనక తాలిబాన్లే ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాణ నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ పేర్కొన్నారు.

Tags:    

Similar News