Khalistan protests: కెనడాలో త్రివర్ణ పతాకాల రెపరెపలు
కెనడా కాన్సులేట్ ముందు ఖలిస్థానీ మద్దతుదారులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల భారీ ప్రదర్శన.... రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు;
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు భారీ ప్రదర్శన నిర్వహించారు. టొరంటో నగరంలో ఖలిస్థానీ మద్దతుదార్లు ఆందోళన చేపట్టగా.. దీనికి దీటుగా భారత జాతీయులు కూడా స్పందించారు. కెనడాలోని భారత కాన్సులేట్ వెలుపల ఇరు పక్షాలు పోటాపోటీగా జెండాలను పట్టుకొని ప్రదర్శనకు దిగాయి. తొలుత ఖలిస్థానీలు ఇక్కడకు వచ్చి ఆందోళన చేపట్టగా.. భారత్‌కు మద్దతుగా కూడా ప్రదర్శనలు మొదలయ్యాయి. భారీగా ప్రవాస భారతీయులు తరలి రావడంతో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. దౌత్యవేత్తలకు, కాన్సులేట్ కార్యాలయానికి రక్షణగా రాయబార కార్యాలయ ప్రాంగణంలో భారత జెండాలను చేతబూని ప్రవాసీయులు నినదించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం, లాంగ్ లీవ్ ఇండియా, ఖలిస్తాన్ ముర్దాబాద్ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. ఖలిస్తానీలు సిక్కు కాదనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఖలిస్తానీకి మద్దతు ఇవ్వడాన్ని మానేయాలని కెనాడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు హితవు పలికారు.
తాము ఖలిస్తానీలను ఎదుర్కోవడానికి కాన్సులేట్ ముందు నిలబడి ఉన్నామని... భారత, కెనడాల సంబంధాలు బలపరిచేందుకే ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని ప్రవాస భారతీయులు తెలిపారు. భారత దౌత్యవేత్తలను హత్య చేస్తామంటూ ఖలిస్తానీ మద్దతుదారులు బెదిరించడాన్ని వారు తీవ్రంగా తప్పు పట్టారు. కెనడా శాంతియుత దేశమని, ట్రుడో ప్రభుత్వం చెబుతున్నట్లు ఖలిస్థానీలది భావప్రకటనా స్వేచ్ఛ కాదని స్పష్టం చేశారు. తాము హత్య చేస్తామని ప్రకటించడం ఎలా భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందని జస్టిన్ ట్రుడో ప్రభుత్వాన్ని నిలదీశారు.
కెనడాలో సిక్కుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల.. ఖలిస్తానీలకే మద్దతిస్తున్నట్లు ఆ దేశ జస్టిన్ ట్రుడో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కెనడాలో భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, అయితే హింసకు తావివ్వమని అన్నారు. దీనిపై భారత్ మండిపడింది. ట్రుడో వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసింది.
కెనడాలోని భారతీయ మూలాలున్న వారికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ అనుకూల సంస్థలు పోస్టర్లతో దుష్ప్రచారం చేస్తున్నాయి. భారత మూలాలు ఉన్న వారిలో భయాందోళన, అశాంతి పెరుగుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదుల వల్ల ఎదురవుతున్న ముప్పు గురించి భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గత నెలలో కెనడాలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన తర్వాత బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని భారతీయ రాయబార కార్యాలయల వెలుపల ప్రదర్శనలు నిర్వహిస్తామని ఖలిస్థాన్ అనుకూల వర్గాలు ప్రకటించాయి. కెనడా, అమెరికాలో భారత రాయబారులను బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీవాస్తవకు బెదిరింపులు వచ్చాయి. దౌత్యవేత్తలను బెదిరిస్తూ వెలిసిన పోస్టర్లపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లోని కెనడా హైకమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.