ప్రపంచ మూడు ప్రసిద్ధ మతాలకు పవిత్ర స్థలంగా విరాజిల్లుతున్న జెరూసలేం ప్రస్తుతం యాత్రికులు లేక వెలవెల బోతుంది. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడె ఈ నగరం ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించడం.. జెరూసలేంలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొనేలా చేసింది. ఫలితంగా ప్రపంచ స్థాయి పర్యాటక స్థలమైన జెరూసలేంలో వ్యాపారాలు పూర్తిగా స్తంభించి పోయాయి. వ్యాపారాలు లేక ప్రజల పరిస్థితి దయణీయంగా మారింది.
ప్రపంచంలో ఎంతో చారిత్రాత్మకమైన ప్రముఖ నగరంగా విరాజిల్లితోన్న జెరూసలేం ఇప్పడు ఎడారిని తలపిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడితో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడులో గాజా దద్దరిల్లుతోంది. అయితే ఈ ప్రభావం నేరుగా జెరుసలేంపైనా పడింది. ఈ పరిస్థితుల వల్ల ఈ నగరానికి సందర్శకులు రావడం పూర్తిగా ఆగిపోయింది. ఉన్నవారు కూడా ముందు జాగ్రత్తతో ఈ నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. ఫలితంగా నగరంలో పర్యాటకులు లేక వ్యాపారాలు జరక్క.. దుకాణాలన్నీ మూతపడ్డాయి.
ఎప్పుడూ వ్యాపారాలతో కిటికిటలాడె జెరూసలేంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. స్థానికులే అప్పుడప్పుడు అవసరాల కోసం బయటకు వస్తున్నారు తప్ప మరెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెలీలే కాక పాలస్తీనా పౌరులు కూడా ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారందరి జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. యూదులు, క్రైస్తవులు, ముస్లీములే కాక.. ఇతర పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. నిత్యం వేలమంది ఈ ఇక్కడకు వస్తుంటారు. వ్యాపారులే కాక టూరిస్ట్ గైడ్‌లూ జీవనోపాధి కోల్పోయారు. రోజుకు దాదాపు 16000 వేల రూపాయలు సంపాదించే గైడ్‌లు ప్రస్తుతం రోడ్డున పడ్డారు. కరోనా సమయంలో ఇలాంటి పరిస్థితులను చూశామనీ మళ్లీ ఇప్పుడే ఆ పరిస్థితులు గోచరిస్తున్నాయని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇజ్రాయోల్ సైనిక చర్యలతో తమ జీవితాలు తారుమారయ్యాయని జెరూసలెం ప్రజలు తెలిపారు.