Chabahar Port : భారత్-ఇరాన్ మధ్య గోల్డెన్ బ్రిడ్జ్.. చాబహార్ పోర్ట్‌పై ప్రపంచ దేశాల కన్ను.

Update: 2026-04-10 10:30 GMT

Chabahar Port : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు విడిపోయి, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ప్రపంచ దేశాల దృష్టి మళ్లీ వ్యాపార మార్గాలపై పడింది. ఈ క్రమంలో ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఓడరేవును భారత్-ఇరాన్ దేశాల మధ్య ఒక గోల్డెన్ బ్రిడ్జ్‎గా ఇరాన్ ఎంబసీ అభివర్ణించింది. అయితే ఈ పోర్ట్‌కు సంబంధించి అమెరికా ఇచ్చిన మినహాయింపు గడువు ముగుస్తుండటంతో.. భారత్ ఇప్పుడు దౌత్యపరమైన కసరత్తును ముమ్మరం చేసింది.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, చాబహార్ పోర్ట్ ద్వారా వ్యాపారం చేసేందుకు భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఉంది. అయితే, ఈ మినహాయింపు గడువు ఏప్రిల్ 26, 2026తో ముగియనుంది. అంటే మరికొద్ది రోజుల్లోనే ఈ గడువు తీరిపోనుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ గడువును మరోసారి పొడిగించాలని భారత్ అటు అమెరికాతో, ఇటు ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ గడువు పెరిగితే, పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, యూరప్ దేశాలకు తన ఉత్పత్తులను తరలించవచ్చు.

చాబహార్ ప్రాముఖ్యత ఎక్కడ?

చాబహార్ పోర్ట్ ఇరాన్ ఆగ్నేయ భాగంలో, ఒమన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఇది పాకిస్థాన్‌లోని చైనా నిర్మించిన గ్వాదర్ పోర్ట్‌కు కేవలం 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాకిస్థాన్ భూభాగం గుండా వెళ్లే అవసరం లేకుండా భారత్ నేరుగా మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి ఇది ఏకైక మార్గం. దీనివల్ల రవాణా ఖర్చులు భారీగా తగ్గడమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సుమారు రూ.15,000 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం ఊగిసలాటలో ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే చాబహార్ పోర్ట్ కార్యకలాపాలు సాఫీగా సాగడం చాలా అవసరం.

వ్యూహాత్మక ఒప్పందాలు

చాబహార్ పోర్ట్ నిర్వహణ కోసం 2024లో భారత్, ఇరాన్‌తో 10 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం చేసుకుంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఈ పోర్ట్‌ను ఆపరేట్ చేస్తోంది. ఈ ఒప్పందం కింద భారత్ సుమారు 120 మిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులను, మరో 250 మిలియన్ డాలర్ల రుణాన్ని కేటాయించింది. ఆంక్షల ప్రభావం తగ్గగానే పూర్తి నియంత్రణను భారత్ చేతుల్లోకి తీసుకునేలా వ్యూహాత్మక ఏర్పాట్లు జరిగాయి. ముంబై నుంచి చాబహార్‌కు గల దూరం దాదాపు 786 నాటికల్ మైళ్లు కాగా, కండ్లా పోర్ట్ నుంచి కేవలం 550 నాటికల్ మైళ్లు మాత్రమే.

గ్లోబల్ పవర్ గా భారత్

అమెరికా గనుక ఈ పోర్ట్‌కు మినహాయింపు గడువును పొడిగిస్తే, అది భారత్‌కు దౌత్యపరంగా పెద్ద విజయమే అవుతుంది. దీనివల్ల భారత్ కేవలం ఇరాన్‌తోనే కాకుండా, ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (INSTC) ద్వారా రష్యా, యూరప్ దేశాల్లో తన వాణిజ్య పట్టును బలపరుచుకుంటుంది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్‎కు భారత్ ఇస్తున్న గట్టి సమాధానం ఇదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోర్ట్ ద్వారా భారత్ కేవలం వ్యాపారమే కాకుండా రాజకీయంగా కూడా మధ్య ప్రాచ్య దేశాల్లో కీలక పాత్ర పోషించబోతోంది.

Tags:    

Similar News