China : అమెరికాపై చైనా సర్జికల్ స్ట్రైక్..బోయింగ్ సహా 20 కంపెనీల క్లోజ్..డ్రాగన్ దేశంలో ఆస్తులు జప్తు.
China : ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు హాట్ గా మారుతోంది. తైవాన్ విషయంలో అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం డ్రాగన్ కంటగింపునకు కారణమైంది. ఎంతలా అంటే.. ఆగ్రహంతో ఊగిపోయిన చైనా, ఏకంగా అమెరికాకు చెందిన 20 అగ్రశ్రేణి కంపెనీలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విమానయాన సంస్థ 'బోయింగ్' కూడా ఉండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అసలు అమెరికా ఏం చేసింది? చైనా ఎందుకు అంతలా రగిలిపోతోంది? ఆ వివరాలు తెలుసుకుందాం
తైవాన్‌కు ఆయుధాలు.. చైనాకు ఆగ్రహం
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు భారీ ఆయుధ ప్యాకేజీని ప్రకటించడమే ఈ గొడవకు అసలు కారణం. సుమారు 11.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.93వేల కోట్లు) విలువైన అత్యాధునిక యుద్ధ సామాగ్రిని తైవాన్‌కు విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ప్రమాదకరమైన మిసైళ్లు, భారీ తోపులు, హైమార్స్(HIMARS) రాకెట్ లాంచర్లు, నిఘా డ్రోన్లు ఉన్నాయి. తైవాన్‌ను తన సొంత భూభాగంగా భావించే చైనాకు, అమెరికా చేస్తున్న ఈ సాయం అస్సలు నచ్చలేదు. ఇది తమ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేయడమేనని చైనా మండిపడుతోంది.
బ్లాక్ లిస్ట్‌లో దిగ్గజ కంపెనీలు
అమెరికా నిర్ణయానికి ప్రతిచర్యగా చైనా విదేశీ వ్యవహారాల శాఖ 20 అమెరికన్ డిఫెన్స్ కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇందులో బోయింగ్‌కు చెందిన సెయింట్ లూయిస్ బ్రాంచ్, నార్త్‌రాప్ గ్రమ్మన్, ఎల్3 హారిస్ మారిటైమ్ సర్వీసెస్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. కేవలం నిషేధించడమే కాదు.. చైనాలో ఉన్న ఈ కంపెనీల ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని ఆదేశించింది. ఇకపై చైనాలోని ఏ సంస్థ గానీ, ఏ వ్యక్తి గానీ ఈ కంపెనీలతో ఎలాంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదని కఠిన నిబంధనలు విధించింది.
నో ఎంట్రీ.. రెడ్ లైన్ దాటొద్దు
కంపెనీలతో పాటు అమెరికాకు చెందిన 10 మంది ఉన్నతాధికారులపై కూడా చైనా వేటు వేసింది. వీరికి చైనాలోకి ప్రవేశం నిరాకరించడమే కాకుండా, వీరి వ్యక్తిగత ఆస్తులను కూడా బ్లాక్ చేసింది. "తైవాన్ అంశం చైనా-అమెరికా సంబంధాల్లో ఒక రెడ్ లైన్. దానిని దాటాలని ప్రయత్నిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి" అని చైనా ఘాటుగా హెచ్చరించింది. తైవాన్ స్వేచ్ఛను కోరుకునే శక్తులకు అమెరికా మద్దతు ఇవ్వడం ఆపకపోతే, భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
డ్రాగన్ భయం ఏంటి?
అమెరికా అందిస్తున్న ఈ 11 బిలియన్ డాలర్ల ఆయుధాలు తైవాన్ సైనిక శక్తిని అమాంతం పెంచుతాయి. ఒకవేళ భవిష్యత్తులో చైనా తైవాన్‌పై దాడికి దిగితే, ఈ ఆయుధాలతో తైవాన్ గట్టిగా ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ఒప్పందాన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా కాంగ్రెస్ ఈ ఒప్పందానికి ఇంకా పూర్తిస్థాయి ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ లోపే చైనా తన విశ్వరూపం చూపిస్తూ అగ్రరాజ్యానికి ఆర్థికంగా షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.