భారతదేశ సంస్కృతిలో భాగమైన భరతనాట్యం విదేశాలకు విస్తరిస్తోంది. చైనాకు చెందిన బాలిక లీ ముజి(13) భరతనాట్యంలో అరంగేట్రం చేశారు. చైనాలోనే శిక్షణ పొంది, అక్కడే అరంగేట్రం చేసిన తొలి యువతిగా చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్ హాజరయ్యారు. 1999లో ఢిల్లీలో అరంగేట్రం చేసిన జిన్ షాన్ ఆ చిన్నారికి గురువుగా వ్యవహరించారు. ఈమె చైనాలో భరతనాట్యం స్కూల్ నడుపుతున్నారు. లీ అరంగేట్రంఆనికి భారత రాయబారి ప్రదీప్ రావత్ సతీమణి శ్రుతి రావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం కోసం లీలా శామన్సన్, ఆమె సంగీత కళాకారుల బృందం చెన్నై నుంచి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చారు. ఈ నెలాఖరులో లీ చెన్నైలో తన భరత నాట్య ప్రదర్శన ఇవ్వనున్నది. భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారిగా గురువు, ఇతరుల ముందు ప్రదర్శన చేయడాన్ని అరంగేట్రంగా వ్యవహరిస్తారు. అరంగేట్రం పూర్తిచేసిన విద్యార్థి సొంతంగా ప్రదర్శనలు ఇవ్వడానికి, ఇతరులకు నాట్యం నేర్పడానికి గురువు అనుమతి లభిస్తుంది.