Crude Oil : కుప్పకూలిన క్రూడాయిల్.. ఆరేళ్లలో ఎన్నడూ లేని విధంగా చమురు ధరల పతనం.. పెట్రోల్ కష్టాలు తీరేనా?

Update: 2026-04-11 08:45 GMT

Crude Oil : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా చొరవతో ఇరాన్ మధ్య రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడమే దీనికి ప్రధాన కారణం. గత వారం రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 13 శాతానికి పైగా పడిపోయాయి. 2020 తర్వాత అంటే దాదాపు ఆరేళ్ల కాలంలో ఒకే వారంలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరాన్ రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు చల్లబడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ ధర 96 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ, యుద్ధానికి ముందున్న ధరలతో పోలిస్తే ఇవి ఇంకా 30 శాతం ఎక్కువే ఉండటం గమనార్హం. ఈ వారంలో నమోదైన 13 శాతం తగ్గుదల అనేది గత ఆరేళ్లలో అతిపెద్ద వీక్లీ డ్రాప్ అని నిపుణులు చెబుతున్నారు.

చమురు ధరలు తగ్గినా, సరఫరా విషయంలో ఇంకా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఈ మార్గం ద్వారా కేవలం ఇరాన్ అనుకూల నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. శాశ్వత శాంతి నెలకొంటే తప్ప ఇక్కడి నుంచి సాధారణ సరఫరా మొదలవ్వదు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం ఇస్లామాబాద్‌లో ఇరాన్ అధికారులతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు సఫలమైతే చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

మధ్యప్రాచ్యంపై ఆధారపడే దేశాలు ఇంధన కొరతను అధిగమించేందుకు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను బయటకు తీస్తున్నాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి తమ దేశ అవసరాల కోసం 20 రోజులకు సరిపడా చమురును విడుదల చేస్తామని ప్రకటించారు. చైనా కూడా తమ నిల్వలను వాడుకోవాలని రిఫైనరీలకు సూచించింది. ఇక భారత్‌లో కూడా ఇంధన సర్దుబాటు చర్యలు మొదలయ్యాయి. ఒకవైపు కాల్పుల విరమణ అమల్లో ఉన్నా, ఇరాన్ దాడుల వల్ల సౌదీ అరేబియాలోని ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ దెబ్బతినడం సరఫరాపై ప్రభావం చూపుతోంది.

డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. హోర్ముజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని ఇరాన్ ప్రపంచ దేశాలను బ్లాక్ మెయిల్ చేస్తోందని, కానీ వారి వద్ద ఇప్పుడు ఎలాంటి కార్డ్స్ లేవని ఎద్దేవా చేశారు. చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధ నౌకలు కొత్త దాడులకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ స్పందిస్తూ.. చర్చలు మొదలవ్వాలంటే లెబనాన్‌లో కాల్పుల విరమణే మొదటి అడుగు అని స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి ఒప్పంద సూచనలు కనిపిస్తుండటం ప్రపంచ మార్కెట్లకు సానుకూల అంశంగా మారింది.

Tags:    

Similar News