ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతతో ముడిచమురు ధరలకు రెక్కలు
ఒక్కరోజులోనే భారీగా పెరిగిన గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు;
ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. జూన్ 13న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఒక్కరోజులో బ్రెంట్ క్రూడ్ ధరలు 11 శాతం వరకు ఎగసి, బ్యారెల్‌కు 70.50 డాలర్ల నుంచి 78.50 డాలర్లకు చేరాయి. ఇది గత ఆరు నెలల గరిష్ట స్థాయి కావడం విశేషం. ఈ పరిణామాలు కొనసాగితే, ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేస్తే చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంచనాల ప్రకారం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120–130 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలకు గణనీయంగా పెరుగుదల ఉండవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్ నేరుగా ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకోకపోయినా, మధ్యప్రాచ్యంలో జరిగే పరిణామాలు గ్లోబల్ చమురు సరఫరాపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం భారత మార్కెట్‌పై పడక తప్పదు.
హర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గంగా పనిచేస్తోంది. ఇది ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఇరుకైన సముద్ర మార్గం. ప్రపంచ ముడిచమురు సరఫరాలో 85% కంటే ఎక్కువ ఈ మార్గం ద్వారానే సాగుతుంది. 2024లో రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ ఈ మార్గం గుండా రవాణా అయ్యాయి, ఇది ప్రపంచ పెట్రోలియం వినియోగంలో సుమారు ఐదవ వంతు. ఈ మార్గం మూసివేయడం లేదా దానిలో అంతరాయం ఏర్పడటం వల్ల చమురు కొరత తలెత్తి గ్లోబల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ మార్గం ద్వారానే అధిక మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుండటంతో, ఇవి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.