Syed Ahmad Maroof: పాక్ దౌత్యవేత్త అసభ్య వీడియోలు

హనీట్రాప్‌లో చిక్కుకుని ఉంటారని వార్తలు;

Update: 2025-05-14 04:00 GMT

బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మారూఫ్ హఠాత్తుగా సెలవుపై వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు రావడం, దానికి సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో హనీట్రాప్ జరిగిందన్న వాదనలు బలపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తన పదవి నుంచి తాత్కాలికంగా వైదొలగినట్టు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ దినపత్రిక 'ప్రథమ్ ఆలో' ప్రచురితమైన కథనం ప్రకారం.. మారూఫ్ మే 11న దుబాయ్ మీదుగా ఢాకా నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ ఆకస్మిక నిష్క్రమణ వెనుక హనీట్రాప్ ఉదంతమే కారణమని వార్తలు వస్తున్నాయి. అయితే, మారూఫ్ అధికారికంగా సెలవుపై వెళ్లినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఢాకాలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలిక హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మారూఫ్ ఢాకా విడిచి వెళ్లిన రోజే ఈ విషయాన్ని పాకిస్థాన్ హైకమిషన్ తమకు అధికారికంగా తెలియజేసిందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఆయన ఎంతకాలం సెలవులో ఉంటారో, సెలవుకు కారణమేమిటో ఆ నోటిఫికేషన్‌లో పేర్కొనలేదని సదరు అధికారి వివరించారు. మారూఫ్ సెలవు సుమారు రెండు వారాల పాటు ఉండవచ్చని సమాచారం. ఆయన అనుకోని రీతిలో విధులకు దూరమవడం ఆన్‌లైన్‌లో తీవ్ర ఊహాగానాలకు దారితీసింది.

ఆన్‌లైన్‌లో వీడియోలు.. హనీట్రాప్ వాదనలు

మారూఫ్ ఒక బంగ్లాదేశీ మహిళతో సన్నిహితంగా ఉన్నట్టుగా చెబుతున్న ఫోటోలు, వ్యక్తిగత వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఈ కుంభకోణంపై పుకార్లు మరింత ఊపందుకున్నాయి. దీంతో మారూఫ్ హనీట్రాప్‌కు గురై ఉంటారనే ప్రచారం జోరందుకుంది. ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్’ అనే ఓ ట్విట్టర్ ఖాతా ఈ ఉదంతంపై స్పందిస్తూ "బంగ్లాదేశ్‌లోని పాకిస్థాన్ రాయబారి సయ్యద్ అహ్మద్ మారూఫ్ ఒక బంగ్లాదేశీ ముస్లిం యువతితో సంబంధం కలిగి ఉన్నారు. కొన్ని సన్నిహిత వివరాలు బహిర్గతం కావడంతో ఆయన్ను సెలవుపై పంపించారు" అని పేర్కొంది. "ఒకప్పుడు పాకిస్థానీయులు బంగ్లాదేశీ ముస్లిం మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు. ఇప్పుడు కొందరు బంగ్లాదేశీ ముస్లిం యువతులు స్వచ్ఛందంగా పాకిస్థానీయులకు లొంగిపోతున్నారు" అని కూడా ఆ ట్వీట్‌లో ఆరోపించింది.

అయితే, ఈ వీడియోల వాస్తవికత ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ కుంభకోణం వెనుక నిఘా వర్గాలు లేదా ప్రతిపక్ష పార్టీల హస్తం ఉండి ఉండవచ్చని, వారు మారూఫ్‌ను ఇరికించి ఉండొచ్చనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. సయ్యద్ అహ్మద్ మారూఫ్ డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఆయన బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ దౌత్యపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఈ తాజా పరిణామాలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News