Donald Trump : ట్రంప్ ఇండియా టూర్ క్యాన్సిల్! ..?
ఎందుకు రద్దు చేసుకున్నారు..
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఇండియాలో పర్యటించాల్సి ఉండగా, ఆ టూర్ ను రద్దు చేసుకున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శనివారం వెల్లడించింది. ఈ ఏడాది ఇండియాలో జరిగే క్వాడ్ (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్) సమిట్ కు హాజరవుతానని ఇదివరకే ప్రధాని మోదీకి ట్రంప్ చెప్పారు. అయితే, భారత్ ను బెదిరించి, పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ పదే పదే చెప్పుకోవడం, రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై భారీగా టారిఫ్ లు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది.
మరోవైపు ప్రధాని మోదీ ఇప్పుడు ఎస్ సీవో సమిట్ కోసం చైనాలో పర్యటిస్తున్నారు. రష్యాకు ఇండియా మరింత దగ్గరవుతుండగా, చైనాతోనూ సంబంధాలను మెరుగుపర్చుకుంటోంది. అందుకే ట్రంప్ ఇండియా టూర్ ను రద్దు చేసుకుని ఉంటారని ఈ మేరకు ‘ది నోబెల్ ప్రైజ్ అండ్ ఏ టెస్టీ ఫోన్ కాల్: హౌ ద ట్రంప్- –మోడీ రిలేషన్షిప్ అన్ రావెల్డ్’ అనే హెడింగ్ తో న్యూయార్క్ టైమ్స్ కథనం వెలువరించింది. గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాలతో మోదీ, ట్రంప్ మధ్య బంధం బలహీనం అయిందని అభిప్రాయపడింది. ట్రంప్ టూర్ రద్దు విషయం ప్రెసిడెంట్ షెడ్యూల్ నిర్వహించే వర్గాల ద్వారా తెలిసిందని వివరించింది. కాగా, న్యూయార్క్ టైమ్స్ కథనంపై ఇటు ఇండియా గానీ, అటు అమెరికా గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.